Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం మత్తుకు అదే సరైన వ్యాక్సిన్ : తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్
- ఫెస్ట్-2022 ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆది నుంచి ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరిపోసి నిలబెట్టింది పాటనేనని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. పాటే ఉద్యమాలకు రథసారధి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో 'పాటకు జేజేలు' థీమ్‌తో లిటరరీ ఫెస్ట్-2022 ప్రారంభమైంది. తెలంగాణ సాహితీ అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఫెస్ట్‌లో మొదట సినీనటుడు కృష్ణకు నివాళి అర్పించారు. సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రారంభ ఉపన్యాసాన్ని జూలూరీ గౌరీశంకర్ చేశారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం తెలంగాణ గడ్డ మీద రైతాంగ సాయుధ పోరాటం జరిగిందనీ, లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచిన చరిత్ర ఆ పోరాటానిదని గుర్తుచేశారు.
బందగీ, షోయబుల్లాఖాన్తో పాటు వేలాది మంది రజాకార్ల మూకల దాడిలో చనిపోయారని తెలిపారు. బందగీ, షోయబుల్లాఖాన్ ఆనాటి పాలకుల దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ఆ నాటి పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో మగ్దూం మొయినోద్దిన్ లాంటి ముస్లింలు కూడా ఉన్నారని తెలిపారు. ఆ నాడు భూస్వాములందరూ హిందూవులేనని చెప్పారు. అయితే, నేడు చరిత్రను వక్రీకరించి ఆ పోరాటం ఓ మతానికి వ్యతిరేకంగా జరిగిందని చిత్రీకరించే కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో తెలంగాణ రైతాంగ పోరాటాన్ని చూడటం చరిత్ర హీనులు చేసే పని అని విమర్శించారు. ప్రజలకు మతం మత్తును ఎక్కించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఇక్కడి ప్రగతిశీల శక్తులు, కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దానికి పాటే సరైన మార్గమనీ, మతం మత్తును వదిలించే వ్యాక్సిన్ పాటేనని నొక్కి చెప్పారు. మొదటి నుంచీ తెలంగాణ గడ్డ మతసామరస్యానికి అడ్డా అని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో ఇక్కడి మత సామరస్యాన్ని గాంధీ పొగిడిన విషయాన్ని గుర్తుచేశారు.
అక్షరం పుట్టక ముందే పాట..
శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె.ఐ.వరప్రసాదరెడ్డి
అక్షరం పుట్టక ముందే పాట పురుడు పోసుకున్నదనీ, నిద్రపుచ్చేది, నిద్రలేపేదీ, మార్గాన్ని చూపేదీ పాటేనని శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. అనివార్య కారణాల వల్ల లిటరరీ ఫెస్ట్‌కు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయిన ఆయన వీడియో సందేశాన్ని పంపారు. జనం పాట అంటే జానపదమే అన్నారు. సినిమా సమకాలీక పరిస్థితులకు దర్పణం అన్నారు. ఒక నాటి, ఇప్పటి సినిమా పాటలకు చాలా తేడా ఉందనీ, ప్రస్తుత సినీ పాటల్లో అర్థంపర్ధం లేని సాహిత్యం వచ్చి చేరుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసల కోసమే, హీరోలను హైలెట్ చేయడం కోసమే వస్తున్న పాటలను తగ్గించేలా చూడాలన్నారు. ప్రతి ఏటా సాహితీ ప్రియులను తట్టిలేపేందుకు తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌లను నిర్వహించడం మంచి పరిణామం అని కొనియాడారు.
పాట ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి : భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
పాట ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నొక్కి చెప్పారు. కవులు, రచయితలు తమ భావాలను వ్యక్తపరచడానికి సోషల్ మీడియా ఒక మంచి వేదికగా ఉపయోగపడుతున్నదన్నారు. విడివిడిగా ఉన్న భావాలను ఒక దగ్గరకు చేర్చి రంగరించి పాటల సింగిడిగా మార్చేందుకు ఇలాంటి ఫెస్ట్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ విప్లవానికైనా, పోరాటానికైనా దారిచూపేది, పట్టాభిషేకర చేసేది పాటేనని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల్లోకి వేగంగా వెళ్లేది, అంతే స్థాయిలో వారిని చైతన్యపరిచేది పాటేనని నొక్కి చెప్పారు. పాట చిరంజీవి అనీ, దానికి మరణం లేదని చెప్పారు.
సాంస్కృతిక విప్లవంతోనే సమాజ మార్పు : మాదాల రవి, సినీనటులు
పాటకు మించిన శక్తియుతమైన ఆయుధం లేదనీ, ఏ దేశం, ఏ రాష్ట్రంలోనైనా సాంస్కృతిక విప్లవం ద్వారానే సమాజ మార్పు జరుగుతుందని సినీనటులు మాదాల రవి నొక్కి చెప్పారు. కొందరు చెబుతున్నట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కుల, మతాలకు వ్యతిరేకంగా జరిగింది కాదనీ, లక్షలాది మంది పేదలకు భూమి పంచిపెట్టిన, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాటం అని స్పష్టం చేశారు. సినిమాల్లో వెయ్యిమందిని నరికి చంపి హీరో అనిపించుకునే వారి కోసం కాకుండా నిజజీవితంలో వెయ్యి మంది కోసం ప్రాణత్యాగం చేసినోళ్ల గురించి పాటలు రాయాలని కోరారు. నటులు హీరోలు కాదురా..తల్లిదండ్రులే నిజమైన హీరోలని చూపెట్టేలా పాటలు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు అభ్యుదయ, విప్లవ శక్తులు ఐక్యమై విప్లవ శంఖం పూరించాలని కోరారు.
మతంతో కాదు.. మతతత్వంతోనే పేచీ : తెలకపల్లి రవి, సాహితీ, సినీ విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు
మతంతో కాదు, మతతత్వంతోనే తమకు పేచీ అని సినీ, సాహితీ విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. మంచి మనస్సు లేని వారు, మానవత్వం లేని వారు మతం గురించి వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. పాట అనేది ఒక బాట, అదొక విజయ బావుటా, ప్రేరణ అని చెప్పారు. తెలంగాణలో పాటకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రతి భక్తి కవిత్వంలోనూ తిరుగుబాటుతనం ఉందని వివరించారు. సమాజంలోని నేటి పరిస్థితులను సవరించడానికి, విజయం సాధించడానికి పాట దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దేశమంతటా హిందీ భాష రుద్దాలనుకున్నవారికి సడన్‌గా తమిళం మీద ప్రేమ పుట్టికొచ్చిందని చెప్పారు. సంగీతం ఒక శక్తి అన్నారు. దాన్ని విప్లవ మార్గానికి ఏవిధంగా ఉపయోగించుకోవాలనే దాన్ని పసిగట్టి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కులాన్ని, మతాన్ని మోసుకు తిరగడం అంటే శవాన్ని మోసుకెళ్లడమే...: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
సమాజంలో కులాన్ని, మతాన్ని మోయడం అంటే శవాన్ని మోసుకు తిరగటమే అని ఎమ్మెల్సీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న విమర్శించారు. దుర్మార్గాలకు పాట ఎప్పుడూ భయపడదనీ, ఎదురించి ముందుకు సాగుతుందని చెప్పారు. పాట సమాజపరమనీ, మనవీయ తత్వాన్ని కలిగి ఉంటుందని అన్నారు. ఆలోచనలు నిరంతరం సంఘర్షించాలనీ, వాటి నుంచి మెరుగైన సమాజం రూపుదిద్దుకుంటుందని అని చెప్పారు. ఎప్పటికైనా కమ్యూనిజమే అజేయం అన్నారు.
పాటల్లో వ్యంగాన్ని జోడించే రచయితలు అవసరం : పీఏ. దేవి, సామాజిక వేత్త
పాటల్లో వ్యంగాన్ని జోడించి పాటలు రాసే రచయితలు నేటి సమాజానికి అవసరమని సామాజికవేత్త, రచయిత్రి పీఏ. దేవి నొక్కి చెప్పారు. మతోన్మాదులు కండ్లెరజేసి చూస్తే భయపడకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. లిటరరీ ఫెస్టులు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అయితే, కవుల్లో ఆసక్తి ఉండాలనీ, శక్తి పెంచుకునేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. లేనిపక్షంలో ముందుకెళ్లడం కష్టమని చెప్పారు. తెలంగాణ సాహితీ అధ్యక్షులు ఆనందాచారి మాట్లాడుతూ..సమూహం ఉద్విగం నుంచి వచ్చిందే పాట అన్నారు. కళలపై నేడు మత, సాంస్కృతిక దాడులు జరుగుతున్న తీరును వివరించారు. పాటపై చర్చ జరగాలన్నారు. మధ్యాహ్నం సెషన్లో ప్రముఖ గాయని విమలక్క, పద్మశ్రీ పురస్కార గ్రహీత కిన్నెర మొగిలయ్య, సినీనటుడు ఎల్బీ శ్రీరామ్, గాయకులు పల్లె నర్సింహ్మ, బండి సత్తెన్న పాటలు పాడి ఫెస్ట్ ప్రతినిధులను ఉత్సాహపరిచారు. ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ..కరోనా కాలంలో వృద్ధుల కష్టాలపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిపెట్టాననీ, పాటలు పాడానని చెప్పారు. మొగిలయ్య మాట్లాడుతూ..తెలంగాణ మట్టిలోనే పాటల పరిమిళం ఉందని చెప్పారు. ఈ సభలో నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, కవి యాకూబ్, గీత రచయిత కె.దేవేంద్ర, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మ, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ్మ, తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు రాంపల్లి రమేశ్, స్ఫూర్తి, తంగిరాల చక్రవర్తి, సహాయ కార్యదర్శి ఎస్కే.సలీమా, కోశాధికారి అనంతోజు మోహన్‌కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.