Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ చుట్టూ ఆర్టిస్టు మార్క్సిస్టు వాదులే : ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న
- దేశవ్యాప్తంగా బీజీపీకి వ్యతిరేకత : ప్రజాశక్తి పూర్వ సంపాదకులు వినయకుమార్
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్
ఈ సమాజంలో మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, పోరాటయోధులను తయారు చేసేది ఎస్ఎఫ్ఐ మాత్రమేనని ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. దీనికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఏమీ తెలియని బాల్య దశలోని కుల వివక్ష, అంటరానితనం.. పేదరికంపై చైతన్య పూరితంగా తయారుచేసి ప్రశ్నించేతత్వం నాకు ఎస్ఎఫ్ఐ నేర్పించిందని అన్నారు. ఆనాటి యూటీఎఫ్ ఉపాధ్యాయులు చదువుతోపాటు భౌతికవాద విషయాలు, శాస్త్రీయ విద్యా విధానం గురించి ప్రతిరోజూ బోధించేవారని తెలిపారు. ఏబీవీపీ వాళ్లతో దెబ్బలు తిన్నా, హాస్టల్లో పురుగుల అన్నంపై పోరాటాలు చేసినా.. అందంతా ఎస్ఎఫ్ఐ ఇచ్చిన పోరాట స్ఫూర్తి చూపిన మార్గమేనని గుర్తు చేశారు. తాను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి, ఒక పెద్ద సింగర్‌గా పేరు తేవడానికి ఎస్ఎఫ్ఐ ఒక బాట వేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉన్న రచయితలు, మేధావులు, సాహితీవేత్తలందరూ మార్క్సిస్టు వాదులేనని తెలిపారు. నేటి విద్యార్థులందరూ సమాజ మార్పు కోసం ఇంకా కీలకంగా పని చేయాలని తెలిపారు. అనంతరం వినయకుమార్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ స్థాపించినప్పుడు తాను ఒక కార్యకర్తనేని గుర్తుచేశారు. ఆ రోజుల్లో హాస్టల్లో దొడ్డన్నం, పురుగుల అన్నం తినలేక పోయామన్నారు. ఈ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ద్వారా పోరాటాలు నడిపించామని గుర్తుచేశారు. సమాజం మారిన తరుణంలో ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ ప్రభావంతో విద్యార్థులు వ్యక్తిగతంగా ఎదగాలనే తత్వం బాగా పెరిగిందన్నారు. సమస్యల పరిష్కారం చేయడానికి పోరాటాల్లోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి నేటి సంఘం నాయకులు ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వ హస్టళ్లు, పాఠశాలల్లో సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమ్మేళనంలో ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు, ప్రస్తుత నాయకులు పాల్గొన్నారు.