Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టపర సౌకర్యాలు అమలు చేయాలి
- డైలీవేజ్ ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాలో జూలకంటి
- సమస్యలు పరిష్కరిస్తాం : అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థినీ, విద్యార్థులకు సేవలందిస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల సేవలకు వెల కట్టలేమనీ, వెట్టి చాకిరి చేస్తున్నారు.. వారి కడుపుకింత బువ్వ పెట్టటం కష్టమా? అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ భవన్ ముందు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనీ, నెల నెలా జీతాలు ఇవ్వాలనీ, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనీ, సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్నారు.. కనీస వేతనాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి ఎం ఇబ్బందులు వచ్చారు? వారి సేవకు గుర్తింపు లేదా? అని ప్రశ్నించారు. చట్టాలు, జీవోలు తెచ్చిన ప్రభుత్వమే వాటిని అమలు చేయకపోతే ఎట్లా? అని అడిగారు. పనెక్కువ ఫలితం తక్కువగా ఉన్నప్పుడు వారు, వారి కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్మికుల్లో పనిచేసేవారందరూ దళిత, గిరిజనులే ఎక్కువగా ఉన్నారన్నారు. వారి కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కాదని చెప్పారు. మేమూ మనుషులమే.. మాకు కనీస అవసరాలుంటారు అని వారు అడుగుతున్నారు.. ప్రభుత్వం వారి వేదనను వినాల్సిందేనని డిమాండ్ చేశారు. సమస్యలను పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకపోవటం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, గిరిజన విద్యారంగం అభివృద్ధిలో వీరి శ్రమ కీలకమని చెప్పారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని మానుకోవాలన్నారు. ఇప్పటికైనా బకాయి వేతనాలు విడుదల చేయాలనీ, నెలనెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ మాట్లాడుతూ డైలీవేజ్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం పేరుతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం శ్రమ దోపిడి చేస్తున్నదని విమర్శించారు. చనిపోయిన వారసులకు డైలీవేజ్ వర్కర్లుగా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నిరవధిక సమ్మె చేయక తప్పదని హెచ్చరించారు.
ఆ తర్వాత జూలకంటితోపాటు సంఘం నేతలు అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. దీంతో ఆయన ధర్నా వద్దకు వచ్చి ఈ నెల 30న జాయింట్ మీటింగ్ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తాంటూ కార్మికులకు హామీ ఇచ్చారు. నాలుగు రకాల పేర్లతో కార్మికులు పనిచేస్తున్నారనీ, వారందరినీ ఒకే పేరు కిందకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలిచ్చే విషయం, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీని ఇచ్చారు. ప్రభుత్వ విధానాలతో ముడిపడిన అంశాలను సమగ్ర నివేదిక ప్రభుత్వానికి ఇస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టేకం ప్రభాకర్, బి మదు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, రాష్ట్ర కార్యదర్శులు కె బ్రహ్మచారి, రాజేందర్, రాష్ట్ర నాయకులు రాములు, కోటేశ్, నంగ్యా, హీరాలాల్, ముత్తయ్య కౌశల్య,జలందర్, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి,పద్మ, సదాశివం, సక్రు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.