Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరేండ్లుగా ఇదే పరిస్థితి...
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాళోజీ కళాక్షేత్రాన్ని రవీంద్రభారతిని తలదన్నేలా నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి ఆరేండ్లు గడిచినా నేటికీ పూర్తి చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరిట నిర్మిస్తున్న కళా వేదిక నిర్మాణాన్ని రూ.50 కోట్ల అంచనా వ్యయంతో 2016లో పనులు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ రవీంద్రభారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. 2018లో ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఆరేండ్లయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్నేండ్లుగా పనులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలుత కళా వేదిక పనులు చేపట్టింది. నిధులు లేక చేతులు ఎత్తేయడంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అప్పగించి వారి నిధుల నుంచి కళాక్షేత్రానికి రూ.10 కోట్లు మళ్లించారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ పనులు ప్రస్తుతం రూ.70 కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే.
2014లో సీఎం కేసీఆర్ కాళోజీ కళావేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4.5 ఎకరాలలో రూ.50 కోట్లతో ఈ కళావేదికను నిర్మించాలని నిర్ణయించారు. రెండేండ్ల అనంతరం 2016 జనవరిలో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. 4 అంతస్తులతోపాటు 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం చేపట్టాల్సి వుంది. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, మ్యారేజీ హాలు, లెక్చర్ హాలు, గ్రీన్ రూమ్, రిహార్సల్స్ రూమ్ల నిర్మించాల్సి వుంది. 1,100 మంది సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం నిర్మాణానికి డిజైన్ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఈ నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేసింది. టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో శ్రీకో ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఈ పనులను తొలుత చేపట్టింది. పలు దశల్లో నిర్మించిన పనులకుగాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సదరు కంపెనీ పనులు నిలిపివేసింది. ఈ దశలో కొన్నేండ్ల పాటు నిర్మాణం నిలిచిపోయింది. మరో రెండేండ్లు కరోనాతో పనులు నిలిచిపోయాయి. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను పున:ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రదర్శించకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం 'కుడా' నుంచి రూ.10 కోట్ల నిధులను కళావేదిక పనులకు బదిలీ చేయడంతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులయ్యాక నిధులు ఇవ్వడంలో మళ్లీ తీవ్ర జాప్యం జరగడంతో పనులూ నిలిచిపోయాయి.
నిధుల లేమితో పెరుగుతున్న అంచనా వ్యయం
రూ.50 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన కాళోజీ కళావేదిక నిర్మాణంలో శంకుస్థాపన నాటి నుంచి నేటి వరకు ఎనిమిదేండ్లు జాప్యం కావడంతో దాని అంచనా వ్యయం రూ.70 కోట్లకు పెరిగింది. హైదరాబాద్కు చెందిన శ్రీకో ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా తప్పుకుంది. తాజాగా బృందావన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఈ పనులు చేపట్టింది. నిధుల లేమితో ఈ కంపెనీ కూడా అర్ధాంతరంగా పనులు నిలిచివేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. పైగా ఇప్పడు ప్రాజెక్టు అంచనావ్యయం మొదటి కంటే రూ.20కోట్లు అదనంగా పెరగడంతో 'కుడా' కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉంది.