Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హృదయాలను హత్తుకునేదే పాట : తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌లో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి
- భావాన్ని భౌతిక శక్తిగా మార్చే ఇంధన శక్తి పాట : కె.దేవేంద్ర
- పాట మీద లిటరరీ ఫెస్ట్ నిర్వహణ గొప్ప పరిణామం : సినీగీత రచయిత జె.కె.భారవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎదుటి వ్యక్తుల హృదయాలను హత్తుకునేలా రాస్తేనే నాలుగు కాలాల పాటు జనం నోళ్లల్లో పాట మెదులుతుందనీ, తెలంగాణ గడ్డపై ఉద్యమ పాటలకు మంచి గుర్తింపు దక్కుతుందని ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్-2022 సోమవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా సినిమా పాటలపై సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జానపద, ఉద్యమ, లలిత గేయాల్లో సాహిత్యం లేదని పండితులు వాటిని చాలా కాలం పాటు తృణీకరించుకుంటూ పోయారనీ, కాలక్రమంలో వాటిల్లోనూ సాహిత్యం ఉందని ఆయా విభాగాల్లోని నిష్ణాతులు తమ అస్తిత్వాన్ని నిరూపించారని వివరించారు. దేనికదే గొప్పదనీ, ఒకదానితో మరోదానితో పోలికపెట్టి తక్కువ చేసి చూడొద్దని వేడుకున్నారు. రచయితలకు మొదటి స్థానం ఇచ్చే సంగీత దర్శకులు కేవీ మహదేవన్ అని కొనియాడారు. ట్యూన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అందర్నీ సంతృప్తిపరిచే పాట రాయడం చాలా కష్టమని చెప్పారు. మంచి ఉద్యమ పాటలు రాస్తే సినిమా పరిశ్రమే వెతుక్కుంటూ రచయితల వద్దకు వస్తుందని తన నిజజీవితంలో ఎదురైన అనుభవాలను వివరించారు. ఉద్యమ రచయితగా అవకాశం దొరకడం తన అదృష్టమన్నారు. త్రిసర, చతుర, ఖండ, మిశ్రమ గతులనే నాలుగు చందస్సుల మీద పట్టుంటే పాటలు రాయడం చాలా తేలిక అనీ, అయితే, నిర్మాతలు, దర్శకులను ఒప్పించడం చాలా కష్టమని చెప్పారు. ఎంతపెద్ద రచయిత అయినా సినిమా ఇండిస్టీలో లౌక్యం అవసరమని పలు ఉదహరణలతో వివరించారు. సినిమాలకు పాటలు రాయడం కంటే ఉద్యమ పాటలు రాయడమే మంచిదనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రొడ్యూసర్లు ఇచ్చిన డబ్బుల కంటే పేలాలు అమ్ముకునే వ్యక్తి పాటను గుర్తించి తన దగ్గర డబ్బులు తీసుకోను అన్నప్పుడు పొందిన ఆనందం మరువలేనిదన్నారు.
తెలంగాణ గడ్డపై ఉద్యమ పాటకే ఆదరణ ఎక్కువ : కె.దేవేంద్ర, ప్రముఖ గీత రచయిత
మొదటి నుంచి తెలంగాణ గడ్డపై ఉద్యమ పాటకే ఆదరణ ఎక్కువని అభ్యుదయ ఆర్ట్ బాధ్యులు, ప్రముఖ గీత రచయిత కె.దేవేంద్ర అన్నారు. 67 ఏండ్ల తన జీవితంలో 52 ఏండ్లుగా పాటతోనే ప్రయాణం సాగుతున్నదన్నారు. ప్రజానాట్యమండలి అనే చెట్టుకు అంటుకట్టడం, సేద్యం చేయడం, పాట తీయడం, అందులోని మట్టి వాసనలు, పూల పరిణామాలను ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ బతుకున్నవాడినని చెప్పారు. జీవితంపై కాలం చేసిన సంతకం పాట అని ఒక్క మాటలో చెప్పేశారు. పాట వ్యక్తిగతం కాదనీ, శ్రమిష్టి శ్రమకు రూపమనీ, పాటకు పంచప్రాణాలు అవసరమని తెలిపారు. ప్రతి పాటా తనదైన చందస్సును కలిగి ఉంటుందనీ, అలాగైతేనే అది రక్తి కట్టించగలుగుతుందని వివరించారు. కవిత్వం రాసేవాళ్లకంటే పాట రాసేవాళ్లకు శిక్షణ ఇవ్వడమే కష్టమన్నారు. తెలంగాణ గడ్డపై ఎప్పుడైనా ఉద్యమ పాటకే ఆదరణ ఎక్కువని చెప్పారు. ఈ గడ్డలోనే రోషం ఉందనీ, మాటలో ఒక సంగీతం, ఒక లయ, ఒక వేగవంతమైన ఉద్వేగ పూరితమైన గొప్ప పాట ఉందని నమస్కరించారు. లైకుల కోసం, మైకుల కోసం, ప్రచారం కోసం ఇష్టానుసారం ఇటీవల అర్థంపర్ధం లేని కొన్ని పాటలు వస్తుండటం బాధాకరమన్నారు. తెలంగాణ గడ్డ మీద ఉన్న రచయితలను అధ్యయనం చేసే రీసెర్చి ప్రాజెక్టు లాగా పాటకు జేజేలు ఫెస్ట్ దోహదపడుతుందని ఆకాంక్షించారు. మానవ జీవితం, పరిసరాలు, రాజకీయాలు, ఉద్యమాలు, ప్రయాణ గమనాలను పరిశీలించకుండా, ఒంటపట్టించుకోకుండా జనం మెచ్చే పాట రాయడం సాధ్యం కాదన్నారు. భావం భౌతికశక్తిగా మార్చటానికి పాట ఒక ఇంధన శక్తిగా దోహదపడుతుందని నొక్కి చెప్పారు.
జీవితం చివరికల్లా విప్లవ రచయితగా గుర్తింపు పొందుతా : జేకే భారవ
పాట పుట్టిన తర్వాత పాటపై ఇంత పెద్ద కార్యక్రమం జరగటం గొప్ప పరిణామం అని ప్రముఖ సినీ గేయ రచయిత జేకే భారవి ప్రశంసించారు. నందిని సిధారెడ్డి కామదేనువు లాంటి రచయిత అని కొనియాడారు. తెలంగాణ యాసలో తాను రాసిన తొలి స్క్రిప్టు కాలిన చేతుల్లో మాడిన న్యాయం అనీ, అది ప్రెసిడెంట్ అయిన తన నాన్న, ఇద్దరు మామలను విలన్లుగా పెట్టి రాశానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఓ కొడుక్కి జోలపాటలో విప్లవాన్ని, తారంగం పాటలో రణరంగాన్ని, చందమామ పాటకు బదులుగా సూర్యుడా..రారా..మంటల్ని తేరా..అన్యాయాన్ని కాల్చేసి పోరా అని రాసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అదే స్క్రిప్టును ఆత్రేయ చేతుల్లో పెడితే పులకించిపోయి మద్రాసుకు పట్టుకుపోయి తనని వారసునిగా చేసుకున్నాడన్నారు. 11 ఏండ్ల శిష్యరికంలో తమ మధ్య నిత్యం ఘర్షణే జరిగేదనీ, విప్లవ భావాలు ఏమయ్యాయని ప్రశ్నించేవాడినని తెలిపారు. అయినా, ఆత్రేయ పాటల్లో విప్లవ భావాలు కనిపిస్తాయన్నారు. విప్లవ పోరాటంలో కలిసిపోదామనుకున్నాననీ, చివరకు తనమీద ఆధ్యాత్మిక సినిమాల స్క్రిప్టు, పాటల రచయితగా ముద్ర పడిందన్నారు. ఇది ఒక కోణమేననీ, కారల్‌మార్క్స్, విప్లవ ఐడియాలతో అద్భుత కథనాలు తన దగ్గర ఉన్నప్పటికీ నిర్మాతలు ముందుకు రావడం లేదని చెప్పారు. తన జీవితం చివరి కాలం నాటికి ఒక విప్లవ రచయితగా గుర్తింపు పొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లిటరరీ ఫెస్ట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ మద్దూరి ఐలయ్య, ప్రజా గాయకులు కాంపాటి శ్రీను, ఆర్.సైదులు, ప్రజా రచయిత ఏ.భాస్కర్ తదితరులు మాట్లాడారు. పలువురు గాయకులు పాటలను పాడారు. సినీ గేయ రచయితలపై పరిశోధక విద్యార్థులు పత్రాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత తిరునగరి శరత్చంద్ర, దుర్గాచారి, తెలంగాణ సాహితీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె.ఆనందాచారి, ఉపాధ్యక్షులు రాంపల్లి రమేశ్, తంగిరాల చక్రవర్తి, సహాయ కార్యదర్శి సలీమా, కోశాధికారి అనంతోజు మోహన్‌కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.