Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్‌తో పాటు మరో వ్యాపారి బుచ్చిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం విచారించారు. ఇరువురిని కలిపి దాదాపు 7 గంటల పాటు విచారించారు. ప్రధానంగా, క్యాసినో పాల్గొన్న హరీశ్ తన డబ్బులను ప్రవీణ్‌కు ఏ విధంగా చెల్లించాడు, అదే సమయంలో తాను క్యాసినోలో గెలుచుకున్న డబ్బులను ఏ విధంగా హైదరాబాద్‌లో తీసుకున్నాడు? దానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా సాగాయి? అనే కోణంలో హరీశ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అదే విధంగా క్యాసినోలో ఎన్నిసార్లు హరీశ్ పాల్గొన్నాడు? అనే కోణాల్లో కూడా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.
అదే సమయంలో చికోటి ప్రవీణ్‌తో పాటు క్యాసినోలో భాగస్వామి అయిన బుచ్చిరెడ్డిని కూడా వివిధ కోణాల్లో ఈడీ ప్రశ్నించింది. మరో భాగస్వామి మాధవరెడ్డిని ప్రశ్నించిన సమయంలో లభించిన ఆధారాలతో బుచ్చిరెడ్డి కూడా భాగస్వామి అని ఈడీ తేల్చింది. క్యాసినోలో ఐదుశాతం భాగస్వామ్యం కల బుచ్చిరెడ్డి.. తన వాటా డబ్బులను క్యాసినోలో ఏ విధంగా వెచ్చించాడు? నేపాల్‌కు పంపటానికి అనుసరించిన మార్గాలేమిటి? అనే దిశగా ఈడీ సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. అలాగే, నేపాల్ క్యాసినోలో పాల్గొని గెలిచివారికి హైదరాబాద్‌లో డబ్బులను ఏ విధంగా ముట్టజెప్పేవారో బుచ్చిరెడ్డి ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నించినట్టు సమాచారం. కాగా, విచారణకు హాజరు కావటానికి వచ్చిన బుచ్చిరెడ్డిని తన ఐదు సంవత్సరాల బ్యాంకు ఖాతాల వివరాలతో రమ్మని ఈడీ అధికారులు మొదట పంపించారు. దీంతో తిరిగి వెళ్లిన బుచ్చిరెడ్డి మూడు గంటల ప్రాంతంలో బ్యాంకు పాసుబుక్‌లు, ఖాతాల వివరాలతో ఈడీ ముందు హాజరయ్యారు. అయితే, బుచ్చిరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు మరింత సమాచార సేకరణ కోసం బుధవారం తిరిగి హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. అంతకముందు, హరీశ్, బుచ్చిరెడ్డిలను కలిపి విచారించారని సమాచారం.