Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు
- న్యాయవాది శ్రీనివాస్‌కు ఎనిమిది గంటలపాటు ప్రశ్నలు
- వాంగ్మూలం నమోదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు గుర్తించి నోటీసులిచ్చిన వారిలో న్యాయవాది శ్రీనివాస్ ఒక్కరే సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ ఎదుట హాజరయ్యారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ సహా తుషార్, జగ్గుస్వామి విచారణకు హాజరుకాలేదు. సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సిట్ ఆనలుగురికి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయవాది శ్రీనివాస్ మరో న్యాయవాదితో కలిసి సోమవారం ఉదయం పది గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న సింహయాజి స్వామి.. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు వీలుగా న్యాయవాది శ్రీనివాస్ ఆయనకు విమాన టికెట్ బుక్ చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. సింహయాజికి టికెట్ బుక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనతో ఉన్న సంబంధమేంటి? అనే విషయాలపై అధికారులు శ్రీనివాస్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలతో శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలపైనా సిట్ ఆరా తీసినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బీజేపీ కీలకనేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు అందినప్పటి నుంచి ఈ కేసులో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఆయన విచారణకు వస్తారా? లేదా? అనేది ఉత్కంఠకు దారితీసింది. కానీ సంతోష్‌తోపాటు కేరళకు చెందిన మిగతా ఇద్దరు సిట్ నోటీసులకు స్పందించలేదు. అనారోగ్యం, ఇతరత్రా ముందస్తు కార్యక్రమాలుంటే తప్ప కచ్చితంగా విచారణకు సోమవారమే రావాల్సి ఉన్నా.. వారు గైర్హాజరవటం గమనార్హం. అయితే సిట్ నుంచి నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాల్సిందేనని, పోలీసులు వారిని అరెస్టు చేయకూడదంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ ఏ విధంగా ముందుకు వెళ్లనుందనేది ఆసక్తిగా మారింది.