Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు తుదివిడతలో సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో కేవలం 136 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు తుదివిడత కౌన్సెలింగ్లో భాగంగా సోమవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్మసీ కోర్సుల్లో 9,520 సీట్లున్నాయని వివరించారు. మొదటి విడతతో కలిపి 9,384 (98.57 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 136 (1.43 శాతం )సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. బీఫార్మసీలో 116 కాలేజీల్లో 7,918 సీట్లున్నాయని వివరించారు. 7,784 (98.30 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 134 (1.70 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఫార్మా-డీ కోర్సుకు సంబంధించి 64 కాలేజీల్లో 1,436 సీట్లుంటే 1,435 (99.93 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇందులో ఒక సీటు మిగిలిందని తెలిపారు. బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్సులో ఒక కాలేజీలో 11 సీట్లు, బయోటెక్నాలజీలో రెండు కాలేజీల్లో 67 సీట్లుంటే వంద శాతం భర్తీ అయ్యాయని వివరించారు. ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించి రెండు కాలేజీల్లో 88 సీట్లుంటే, 87 సీట్లు భర్తీ అయ్యాయనీ, ఒక సీటు మిగిలిందని తెలిపారు.