Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలనీ, సమ్మెకాలం వేతనం, పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్ల జీవోలను విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధులుగా విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం వీఆర్ఏలు రెండేండ్లుగా అధికారులను, మంత్రులను వేడుకున్నా పరిష్కారం లభించలేదన్నారు. అనివార్యంగా 80 రోజుల పాటు సమ్మె చేశారని తెలిపారు. సమ్మె సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకత్వంతో పాటు వీఆర్ఏ జేఏసీ నాయకులను పిలిచి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని స్వయంగా సీఎస్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.