Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం అమలు చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ - భువనగిరి
అంగన్వాడీలపై పని భారాన్ని తగ్గించాలని, కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని రాయగిరిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభ సోమవారం ముగిసింది. సభ చివరి రోజు భూపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ స్కీమ్‌లో పనిచేస్తున్న అంగన్వాడీలకు.. ఆటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సర్వేల పేరుతో రకరకాల పనులు చెప్పడంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. తక్షణమే పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్‌ను మూసేయాలనే కుట్రతో కేంద్రం నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. ఐసీడీఎస్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ శాఖగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లను, ఆయాలను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, పోతరాజు జయలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. నూతన జాతీయ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, కట్కూరి రమాకుమారి, జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎండి.పాషా, నాయకులు పోతరాజు జహంగీర్ పాల్గొన్నారు.