Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ - నారాయణపేట రూరల్
రైతుల ఆత్మహత్యను నివారించాలంటే.. వారిని రుణ విముక్తుల్ని చేయాలని, కనీస మద్దతు ధర చట్టం తేవాలని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ధరణి అనేక సమస్యలతో లోపాలతో ఉందన్నారు. దాదాపు నాలుగు లక్షల మంది రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకుంటే సగం మందికి పైగా పరిష్కారం కాలేదని విమర్శించారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత ఆత్మహత్యలను ఆపాలంటే రైతులను రుణ విముక్తుల్ని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండించే పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, చట్టం తేవాలని అన్నారు. పంటలకు తేమ శాతం, మట్టి తదితర కారణాలతో తక్కువ ధర చెల్లిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏమీ సాధించుకోలేకపోతున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. మనల్ని పాలిస్తున్న పాలకులు రూ.140 లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తిన మోపాలని చూస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతను అగౌరపరిచే ఐఏఎస్ అధికారులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకూ పింఛన్ మంజూరు చేయాలన్నారు. మనదేశంలో 40 మంది బడాబాబులు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లి దర్జాగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి కోసం పది వేలు అప్పు చేసిన రైతును బ్యాంకర్లు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాసభలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ అంజలి గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జోషి, రైతు సంఘం నాయకులు అశోక్, మహేష్ కుమార్ గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.