Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఐక్యఉద్యమాలతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో జరుగుతున్న టీఎస్‌యూటీఎఫ్ మహాసభ రెండో రోజు సోమవారం ప్రతినిధుల సభను జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎనిమిదేండ్లుగా విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అమలు కోసం స్వతంత్ర పోరాటాలతో పాటు ఐక్య ఉద్యమాల నిర్మాణంలో టీఎస్‌యూటీఎఫ్ ముందుందన్నారు. విద్యారంగంలో ఉన్న దీర్ఘకాలికల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతర ఉద్యమాలు చేస్తున్నప్పటికీ పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ సంఘటితమై ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 12 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని, డిప్యూటీ డీఈఓ పోస్టులు 56 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 591 మండలాలకు 503 ఎంఈఓ పోస్టులు ఉండగా, 17 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారని తెలిపారు. 88 ఎంఈఓ పోస్టుల మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను ప్రమోషన్లతో భర్తీ చేయాల్సి ఉందన్నారు. అప్‌గ్రేడేషన్ పండితులు, పీఈటీలు, పీఎస్ హెచ్ఎం పోస్టులలో ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. పీఆర్సీ-2020కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర అలవెన్సుల జీవోలను విడుదల చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు, టీఆర్టీ ఉపాధ్యాయులకు రెండు స్టేజీల ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని కోరారు. 317 జీవోలు సవరించి బాధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఏకృత విధానం అమలు కోసం కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాల కోరారు.
కేజీబీవీ మోడల్ స్కూల్ సిబ్బందికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భోజనానికి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 చొప్పున చెల్లించి కార్మికుల గౌరవ వేతనం పెంచాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి మాట్లాడుతూ.. కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బందికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనచట్టం అమలు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్‌రెడ్డి, కె.అరుణభారతి, కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.