Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన టీవీసీసీ చైర్మెన్ డాక్టర్ కె వాసుదేవ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, వాటిని తిప్పికొట్టేందుకు వికలాంగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ కె వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఎన్పీఆర్డీ జాతీయ మూడో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి సారిగా డిసెంబర్ 26-28 వరకు సంఘం అఖిల భారత మహాసభలు నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ మహాసభలో వికలాంగుల హక్కుల, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. దేశంలో వికలాంగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని గుర్తుచేశారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ 33 జిల్లాల్లో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై సెమినార్లు, చర్చాగోష్ట్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 26న వేలాది మంది వికలాంగులతో నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి అర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు జెర్కొని రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికళ, నాయకులు శివశంకర్, రజిత తదితరులు పాల్గొన్నారు.