Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరారు. ప్రత్యక్ష నియామక పోస్టులకు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సూచించారు. భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం పాఠశాల విద్యలో పర్యవేక్షక పోస్టులైన ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్, బీఈడీ, బీపీఈడీ లెక్చరర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పారిశుధ్యం, సర్వీసు పనుల కోసం గతంలో నియమించిన విధంగానే సర్వీసు పర్సన్లను విద్యాశాఖ నియమించాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు డీఈవో, మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని పేర్కొన్నారు. 40 ఉన్నత పాఠశాలలకు ఒక జిల్లా ఉప విద్యాధికారి పోస్టు ఉండేలా అదనపు ఉప విద్యాధికారి పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2012లో కొన్ని గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా మార్చారనీ, కానీ ఇప్పటి వరకు వాటికి రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయలేదని వివరించారు. ఆశ్రమ ఉన్నత పాఠశాలలన్నింటినీ గురుకులాల స్థాయిలో అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని కోరారు. కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు (సీఆర్టీ)గా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 90కిపైగా మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాల్, సగం వరకు పీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించేలా ఆరోగ్య కార్డులివ్వాలని తెలిపారు. కేజీబీవీలు, యూఆర్ఎస్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు. అప్పటిలోపు వారికి కనీస మూలవేతనం చెల్లించాలని సూచించారు. కేజీబీవీల్లో కేర్‌టేకర్ పోస్టును మంజూరు చేయాలని కోరారు. వారికి నగదు రహిత చికిత్స అందించేందుకు ఆరోగ్యకార్డులను మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.