Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్‌సౌధలో ఇంజినీర్ల సంఘాల ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్లో తెలంగాణ స్థానికత ఉద్యోగుల ప్రమోషన్లను రివర్షన్ చేస్తే సహించేది లేదని విద్యుత్ ఇంజినీర్ల సంఘాలు యాజమాన్యాన్ని హెచ్చరించాయి. ఏపీ స్థానికత ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలనే సుప్రీంకోర్టు తీర్పు అమలు పేరుతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేయోద్దని కోరాయి. సోమవారం విద్యుత్ సౌధలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ), తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ)లు వేర్వేరుగా ఇదే అంశంపై ఆందోళనలు నిర్వహించాయి. టీఎస్‌పీఈఏ అధ్యక్షులు పీ రత్నాకరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఏ వెంకటనారాయణ, అడిషనల్ జనరల్ సెక్రటరీ అంజయ్య, ప్రధాన కార్యదర్శి పీ సదానందం తదితరులు పాల్గొన్నారు. టీఈఈఏ అధ్యక్షులు ఎన్ శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రా ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రమోషన్లు తమకే కావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాల్సి వస్తే, సూపర్న్యూమరెరీ పోస్టులు క్రియేట్ చేయాలని సూచించారు. అంతేకాని ఇప్పటిక పదోన్నతలు తీసుకున్న తెలంగాణ ఉద్యోగులను రివర్షన్ చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా, స్వరాష్ట్ర ప్రతిష్టకోసం తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు చాలా కష్టపడ్డారని గుర్తుచేశారు.
మంత్రికి విజ్ఞప్తి
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ బీసీ మరియు ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడెపాక కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, తెలంగాణ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. టీఈఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శివాజీ ప్రతినిధి బృందం కూడా మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది.