Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి: పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముషం రమేష్, కూరపాటి రమేష్
- రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ- నల్లగొండ
కాలం చెల్లిన చట్టాలను ఉపయోగించి పవర్ లూమ్ పరిశ్రమపై చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఆపాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముషం రమేష్, కూరపాటి రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ పద్మశాలి ఫంక్షన్హాల్లో రెండ్రోజులు జరిగిన తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండ్రోజులపాటు జరిగిన మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించినట్టు తెలిపారు. ఈ తీర్మానాల సాధన కోసం భవిష్యత్తులో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పవర్లూమ్ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పైగా 1983లో చేనేత రక్షణ కోసం చేసిన చట్టాన్ని ఆసరాగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కార్మికులపై దాడులు చేసి కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పెరిగిన టెక్నాలజీకి అనుగునంగా చేనేత కార్మికులే మగ్గాన్ని మర మగ్గంగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. అనంతరం 23 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర నూతన కమిటీ..
మహాసభ చివరి రోజు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ముషం రమేష్, ప్రధాన కార్యదర్శిగా కూరపాటి రమేష్, కోశాధికారిగా దండెంపల్లి సత్తయ్య, ఉపాధ్యక్షులుగా గుడిగందుల సత్యం, ఇనుముల శ్రీనివాస్, పెండెం రాములు, సిరిమల సత్యం ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా కోడెం రమణ, కిష్టప్ప, ఎలిగేటి రాజశేఖర్, కమిటీ సభ్యులుగా మారంపల్లి నాగభూషణం, ఉడుత రవి, అంకం మురళి, గంజి నాగరాజు, పెండెం బుచ్చి రాములు, గంజి శంకర్, కుమ్మరి కుంట కిషన్, దూడం గంగాధర్, వై.కృష్ణ హరి, డి.నాగేశ్వరరావు, అశోక్, కూచన శంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తీర్మానాలు..
- పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
- చేనేత తరహాలోనే పవర్లూమ్ కార్మికులకు త్రిఫ్ట్ పండ్ పథకం రెండింతలు అమలు చేయాలి.
- పవర్లూమ్ పరిశ్రమపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఆపాలి.
- వర్కర్ని యజమాని చేసే సిరిసిల్ల ప్యాకేజీని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.
- పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వమే పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
- కార్మికులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
- పవర్లూమ్ బంధు ఏర్పాటు చేసి కార్మికులందరికీ జీవనోపాధి కోసం ఎలాంటి షరతులూ లేకుండా రూ.10 లక్షలు ఇవ్వాలి.
- షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్‌లో ఉన్న పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించాలి.
- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.
- చేనేత వస్త్రాలపై కేంద్రం వేసిన జీఎస్టీ రద్దు చేయాలి.