Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంలో విప్లమార్పులకు శ్రీకారం
- ఇంజినీరింగ్‌తోపాటు డిగ్రీ విద్యార్థులూ పొందేలా చర్యలు
- ఉన్నత విద్యామండలి, టీసీఎస్అయాన్, టీఎస్ ఆన్లైన్ సమావేశంలో మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మార్కెట్ అవసరాలు, డిమాండ్ ఉన్న కోర్సులతోనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంజినీరింగ్‌తోపాటు డిగ్రీ చదివిన విద్యార్థులూ ఐటీ, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని రంగాల్లో ముందున్నట్టుగానే విద్యారంగంలోనూ తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. 'విద్యారంగంలో సాధికారత- ఉపాధి అవకాశాల పెంపుదల'అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి, టీసీఎస్ అయాన్, టీఎస్ ఆన్లైన్ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి మట్లాడుతూ ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు చేతిలో పట్టుకుని కోటి ఆశలతో బయటికెళ్తున్నారని అన్నారు. కానీ వారంతా వృత్తి నైపుణ్యం లేక ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చాల్సిన అవసరముందన్నారు. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు పోటీపడి చేరితే మరికొన్నింటి వైపు చూడటం లేదని వివరించారు. క్యాంపస్ ప్లేస్మెంట్ల కారణంగానే ఆయా కాలేజీల్లో పోటీపడి చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులు పోటీపడే చేరే రోజులు రావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ దిశగా డిమాండ్ ఉన్న కోర్సులను రూపొందించాలని ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలొస్తున్నాయనీ, ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంలో రాష్ట్రం ముందుందని అన్నారు. గత ఎనిమిదేండ్లల్లో 17 వేలకు పైగా పరిశ్రమలు రాగా, 15 లక్షల ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. కొత్తగా 1,500కు పైగా ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తే, ఏడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తేవాలని కోరారు. పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానించాలని, ఈ దిశగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించి అమలుచేయాలని సూచించారు.
విద్యార్థులకు నైపుణ్యం అవసరం : జయేష్‌రంజన్
విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందిం చుకోవడం ఎంతో అవసరమని ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ సూచించారు. నిరంతరం అవగాహన కల్పించడం ద్వారానే విద్యా ర్థులను ఉద్యోగాలకు సన్నద్ధం చేయగలమన్నారు. అమెరికా వంటి విదేశాలకు వెళ్లే ఆలోచనలు మానుకుని మనదగ్గరే పరిశోధనతో స్టార్టప్‌లను తయారు చేసి ఏదో ఒక పరిశ్రమను స్థాపించేందుకు నిత్యం ప్రయత్నించాలని సూచించారు. ఈ తరహాలో విద్యావిధానాన్ని సమూలంగా మార్చాలన్నారు.
అందుబాటులోకి కొత్త కోర్సులు : లింబాద్రి
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. బీఎస్సీ బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డాటా సైన్స్, బీఏ ఆనర్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రస్తుతమున్న కరిక్యులం (పాఠ్యప్రణాళిక) 20 ఏండ్ల క్రితంనాటిదని అన్నారు. దీన్ని పూర్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టీహబ్, వీహబ్ తరహా సెంటర్లను విద్యాసంస్థల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, టీసీఎస్ కంట్రీ మార్కెట్ హెడ్ గోపాలక్రిష్ణ, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్వి రమణారావుతోపాటు వివిధ వర్సిటీల వీసీలు కట్టా నర్సింహారెడ్డి, సిహెచ్ గోపాల్‌రెడ్డి, డి రవీందర్, లక్షీకాంత్రాథోడ్, రవీందర్‌గుప్తా, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.