Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజులు హెచ్ఐసీసీలో...
- దేశ, విదేశాల నుంచి 370 కంపెనీల ప్రతినిధులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అత్యంత ప్రతిష్టాత్మకమైన 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో నిర్వహణకు హైదరాబాద్ వేదిక కానుంది. బుధవారం నుంచి 25 వరకు మూడ్రోజుల పాటు హెచ్ఐసీసీలో ఈ ప్రదర్శన జరుగుతుంది. మంగళవారం ఇక్కడే నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి దాదాపు 370 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో పాల్గొననున్నారు. సోమవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఇఎంఏ) అధ్యక్షులు పీ చక్రధర్‌రావు, తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీఎస్పీఎఫ్) అధ్యక్షులు ఈ ప్రదీప్‌రావు, నేషనల్ ఎగ్ ప్రైస్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్సీపీసీ) కార్యదర్శి సిరీష్ ధోపేశ్వర్, ఈఏసీ పౌల్ట్రీ ఇండియా సభుయలు డాక్టర్ కేజీ ఆనంద్, ఐపీఈఎమ్ఏ డైరెక్టర్లు అనిల్ థుమాల్, హరీష్ గార్వార్, కోశాధికారి ఉదరు సింగ్ బయాస్ తదితరులు ఈ ఎక్స్పో వివరాలను వెల్లడించారు. దేశంలో పోషకాహార, ప్రొటీన్ లోపాన్ని రూపుమాపడంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని తెలిపారు. దీనివల్ల ప్రపంచ స్థాయిలో పౌల్ట్రీ మాంసం, గుడ్లు ఉత్పత్తి చేయగల్గుతున్నామనీ, ఉత్పాదకత పెరిగి, పశుసంవర్ధక జీడీపీకి పరిశ్రమ కీలకంగా సహకరిస్తున్నదని తెలిపారు. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి చూపిస్తున్నదని వివరించారు. ఎక్స్‌పోలో మన దేశం నుంచి 331 కంపెనీలు, ఇతర దేశాల నుంచి 39 కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. దాదాపు 30 వేల మంది బిజినెస్ విజిటర్స్ ఈ ఎక్స్పోను సందర్శిస్తారని అంచనా వేశామన్నారు. ప్రాసెస్ చేసిన కోడి మాంసం డిమాండ్ 10-21 శాతం మధ్య పెరిగిందనీ, మన దేశం గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నదనీ, చికెన్ ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాతి స్థానం భారతదేశానిదే అని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా గురించి ఇతర వివరాల కోసం http://www..poultryindia.co.in వెబ్ సైట్‌ను, పౌల్ట్రీ ఎక్స్‌పోకు వివరాల కోసం 9490612032, 9849012030 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.