Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాలో పెరిగిన యాజమాన్యాల చొరవ
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభ లోగో ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆధునిక యుగంలో పత్రికల స్వేచ్ఛకు, జర్నలిస్టుల హక్కులకు ఆటంకం కలుగుతోందని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభ 'లోగో' ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ తిరుమలగిరి సురేందర్, ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయకుమార్, ఇండియా టీవీ తెలంగాణ ఇన్చార్జి సురేఖ తదితరులు పాల్గొని మహాసభ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయకుమార్ మాట్లాడుతూ.. సమస్యలు, అన్యాయాలు, పేద వర్గాలపై జరిగే వివక్షలపై వార్తలు రాసేందుకు కూడా విలేకర్లు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులను, యూనియన్లను అణచివేస్తున్నాయని చెప్పారు. దురదృష్టవశాత్తు మీడియాలో వార్తల ప్రచురణలో ఎడిటర్ల చొరవ తగ్గి, యాజమాన్యాలది పెరిగిపోయిందన్నారు. దీంతో క్వాలిటీ కంటెంట్లు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన డిజిటల్ జర్నలిజంలో మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు కూడా మీడియా అంటే చిన్నచూపు కలిగే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ తిరుమలగిరి సురేందర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్లు పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వ మద్దతును కూడగట్టుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. ఈనెల 27న హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్బన్, రూరల్ జర్నలిస్టుల సమస్యలపై మహాసభలో చర్చించి వారికి న్యాయం జరిగే విధంగా తీర్మానాలు చేయబోతున్నట్టు చెప్పారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం చేయాలన్నారు.
ఇండియా టీవీ తెలంగాణ ఇన్చార్జి సురేఖ మాట్లాడుతూ.. మీడియాలో మహిళల ప్రాధాన్యత పెరగాలన్నారు. కోవిడ్ వంటి పరిస్థితులు తలెత్తినా, జర్నలిస్టులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. యూనియన్లు కూడా ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతూనే.. అందులో భాగంగా టీడబ్ల్యూజేఎఫ్ మహాసభను విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పి.ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, రాంచందర్, హెచ్‌యూజే కార్యదర్శి బొల్లె జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.