Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని
- బీజేపీకి వ్యతిరేకంగా ఉధృత పోరాటం చేస్తామని వ్యాఖ్య
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పక్కా ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు సరిపోవని, రూ.5 లక్షలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను విచ్చలవిడిగా అమ్మేస్తూ, మతోన్మాదాన్ని విస్తరింపచేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా మున్ముందు పోరాటాలను మరింత ముమ్మరం చేయనున్నట్టు స్పష్టంచేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో 8 నెలల కిందట భూపోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న సుందరయ్య కాలనీలో నూతన గృహాలను ఆయన ప్రారంభించారు. సంఘం పతాకాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు ఆవిష్కరించారు. అంతకుముందు బస్టాండ్ నుంచి సుందరయ్యనగర్ కాలనీ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. 1.20 ఎకరాల్లో 120 కుటుంబాలు గుడిసెలు వేసుకోగా, ఇందులో 90 కుటుంబాలు ఇండ్లను నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. భూ పోరాటం చేసి ఇండ్లు సాధించుకున్న స్థానికులకు తమ్మినేని అభినందనలు తెలిపారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఐక్యతను ప్రదర్శించారో అదే ఐక్యతను కొనసాగించాలని కోరారు. భూ పోరాటాన్ని కొనసాగిస్తూ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సాధించుకునేంతవరకూ మేం కొండంత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో సీఎం కేసీఆర్తో జరిగిన చర్చల్లో 4-5 ఏండ్లుగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పామని, అంతేకాకుండా పక్కా ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు సరిపోవని, రూ.5 లక్షలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. లేనిపక్షంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరామన్నారు. దేశంలో మతోన్మాదాన్ని విస్తరిస్తున్న బీజేపీని ఓడించడానికి వామపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఎర్రజెండా అవసరమని గుర్తించి సీఎం కేసీఆర్ వామపక్షాలతో పొత్తుకు ఆహ్వానించారని, అందుకే వారికి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. మునుగోడులో 5 సార్లు వామపక్షాలు విజయం సాధించడంతో, ఓటు బ్యాంకు ఉండటంతోనే టీఆర్ఎస్ 10 వేల మెజార్టీతో విజయం సాధించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారని, వచ్చే ఎన్నికల్లోనూ పొత్తుతో పోటీ చేద్దామని ఆహ్వానించారని, ఎన్నికల సందర్భంలో మాట్లాడుకుందామని చెప్పామని వివరించారు. టీఆర్ఎస్ సానుకూలంగా ఉన్న క్రమంలో ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించామన్నారు. పోడు భూములు పంపిణీ చేయాలని కోరామని, ఈ క్రమంలోనే సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈ సర్వేపై క్షేత్రస్థాయిలో పరిశీలించామని, పలు లోపాలు తమ దృష్టికి వచ్చాయని, ఇచ్చిన హామీ మేరకు సమస్యలన్నింటినీ పరిష్కరించి సీఎం నిలబెట్టుకోవాలని కోరారు.
స్థానిక నాయకత్వం బలపడాలి : పోతినేని సుదర్శన్రావు
ఎనిమిది నెలలుగా భూ పోరాటం చేసి ఇండ్ల నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం మరింత బలపడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు కోరారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇండ్లను నిర్మించుకున్న మీరందరూ అభినందనీయులన్నారు. పేదలు చేస్తున్న భూ పోరాటంలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొనడానికి వస్తుండగా రాయపర్తిలో తనని, తమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ధర్నా నిలిచిపోతుందనుకున్నారని, కానీ మీరంతా పట్టుదలతో ధర్నా చేయడంతోనే భూపోరాటం విజయవంతం అయిందని తెలిపారు. పేదలు చేస్తున్న భూపోరాటంపై నిర్బంధంతో వరంగల్ పోలీసు కమిషనర్, డీజీపీని కలిశామని, పేదలు గుడిసెలు వేసుకుంటే పోలీసుల సహకారంతో రౌడీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దౌర్జన్యంగా పీకేయడమేంటని ప్రశ్నించామని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేస్తే వూరుకోమని హెచ్చరించామన్నారు. ఎక్కడ భూ పోరాటం చేశామో అక్కడే ఇండ్లు కట్టి తీరుతామని స్పష్టంచేశారు. ఇక నుంచి ఇది నాగుల చెరువు కాదని, పేద ప్రజల ప్రియతమ నాయకుడు సుందరయ్య నగర్ కాలనీగా కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 29న ఖమ్మంకు కేరళ సీఎం పినరయి విజయన్ వస్తున్నారని, అక్కడ జరిగే సభకు మీరందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. సీఎం విజయన్ కేరళలో ఒక్కొక్క పేద కుటుంబానికి రూ.6 లక్షలు వెచ్చించి ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. అలాంటి ఆదర్శవంతమైన పాలన మనకు రావాలన్నారు.
వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ.. భూ పోరాటం ప్రారంభించే సమయంలో ఎంతో భయంతో ఉన్నారని, ఎన్నో అడ్డంకులు, బెదిరింపులను అధిగమించి నేడు ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఇదే ధైర్యం, ఐక్యతతో ముందుకు సాగితే మరిన్ని సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా, కాలనీలో ప్రధాన సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సభలో రైతుసంఘం నాయకులు ఎం. చుక్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు, గొడుగు వెంకట్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు భానూనాయక్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.