Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
- సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్న మోడీ
- ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్ల పెత్తనం : సింపోజియంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని పలువురు వక్తలు విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సింది పోయి కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపైనా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అధికారాలను గుంజుకుం టున్నదని అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతి రేకమన్నారు. ఇలాంటి పద్ధతి కొనసాగితే ప్రజా స్వామ్యానికే ప్రమాదకరమని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేం దుకు రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలూ, శక్తులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. 'సహకార సమాఖ్య వ్యవస్థ ప్రస్తుత సవాళ్లు'అనే అంశంపై మంగళవారం సికింద్రాబాద్‌లో సింపోజియం (సమ్మేళనం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కీలకోపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు న్నాయని చెప్పారు. కానీ రాష్ట్రాల హక్కులపైనా కేంద్రం అజమాయిషీ చెలాయిస్తున్నదని విమర్శిం చారు. నూతన విద్యావిధానం, రైతు చట్టాలను ఏకపక్షంగా తెచ్చిందన్నారు. ఇంకోవైపు రాష్ట్రాల ఆర్థిక వనరులపైనా పెత్తనం చేస్తున్నదని అన్నారు. అనేక రకాల సెస్‌లను కేంద్రం విధిస్తున్నదని చెప్పారు. సెస్‌ల పేరుతో 2014లో 13 శాతం వసూలు చేస్తే, ప్రస్తుతం 20 శాతానికి పెరిగాయని అన్నారు. జీఎస్టీతో పన్నులు పూర్తిగా కేంద్రానికే వెళ్తున్నాయని వివరించారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించకుండా, అప్పుల కోసం అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని అన్నారు. మోడీ సర్కారు వైఖరితో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు అనేది సమాఖ్య విధానానికి వ్యతిరేకమని అన్నారు. హిందీ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లోని గవర్నర్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తు న్నారని చెప్పారు. సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై తీరుపై అందరం కలిసి దేశవ్యాప్తంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలకు ఇబ్బందులు : కెకె
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను నాశనం చేసేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం చెలాయించేలా చట్టాలను రూపొందిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. మోడీ సర్కారు ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలు అనేక ఇబ్బందులు పడుతు న్నాయని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ రాష్ట్రాలను సంప్రదించ కుండానే కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దు, జీఎస్టీతోపాటు రైతు చట్టాలను తెచ్చిందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థను కాపాడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్ష తరహాలో మోడీ ప్రభుత్వం ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేసేందుకే బీజేపీ అధికారంలో ఉందన్నారు. దానికి హిట్లర్ ఫాసిజమే ఆదర్శమని అన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నా లు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య వ్యవస్థపైనా, ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర, ఉమ్మడి జాబితాలోని వ్యవసాయం, విద్య, విద్యుత్, నీరు వంటి అంశాలను కేంద్రం లాగేసుకుంటున్నదని విమర్శించారు. రాబోయే కాలంలో దక్షిణాది రాష్ట్రాలు తిరగబడే రోజులొస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు టంకశాల అశోక్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, ఆప్ నేత డి సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక అధికారాలతోపాటు సాంస్కృతికంగా రంగంపైనా కేంద్రం దాడి చేస్తున్నదని విమర్శించారు. అధికారాలన్నీ కేంద్రీకృతమవుతున్నాయనీ, కేంద్రం పెత్తనంలోకి వెళ్తున్నాయని చెప్పారు. రాష్ట్రాల హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక్కడ తరహాలోనే ఢిల్లీలోనూ సింపోజియం నిర్వహిస్తామని అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రయివేటు కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాలు, సిబ్బంది సంక్షేమ సంఘం (టీపీసీఎస్ఎంఏ) అధ్యక్షులు పీఎల్ శ్రీనివాస్ ప్రకటించారు.