Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్పై సీఎం వరుస భేటీలు
- ప్రతి రోజూ ముఖ్య నేతలతో సమాలోచనలు
- త్వరలో పార్టీలోకి పీవీ తనయుడు ప్రభాకరరావు..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక ఇచ్చిన ఊపుతో ముఖ్యమంత్రి కేసీఆర్... భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై మరింతగా దృష్టి సారించారు. అందుకనుగుణంగా పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లు, కీలక నాయకులతో ఆయన రోజువారీ భేటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఇలాంటి అంతర్గత చర్చలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించినప్పటికీ అక్కడ అనుకున్నంత మెజారిటీ సాధించలేకపోయామంటూ సీఎం ఈ సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అక్కడ కూసుకుంట్లను కాకుండా మరొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే మెజారిటీ 20 వేల దాకా వచ్చేదంటూ ఆయన అభిప్రాయపడ్డట్టు వినికిడి. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో వచ్చే సంవత్సరం (2023) చివరి అంకంలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా బలాబలాలు, ఎమ్మెల్యేల బలహీనతలు, వారి గెలుపోటములపై ఆయన నిరంతరం లెక్కలేస్తున్నారు. గతంతోపాటు ఇటీవల నిర్వహించిన పలు సర్వేలను సైతం సీఎం ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో 'సిట్టింగులను మార్చబోం...' అంటూ ఆయన హామీనిచ్చినప్పటికీ... అనేక నియోజకవర్గాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ క్యాడర్‌తోపాటు ప్రజల్లోనూ వ్యతిరేకత ఉండటమే దీనికి కారణం. సిట్టింగుల్లో 40 నుంచి 50 శాతం మందిని మార్చకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించటం ఇక్కడ గమనార్హం. కేసీఆర్ సైతం ఇదే రకమైన అంచనాతో ఉన్నట్టు సమాచారం.
ఒకవైపు ఈ రకంగా శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు షురూ చేసిన గులాబీ బాస్.. మరోవైపు బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో విస్తరించటంపై ఫోకస్ పెట్టారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఇప్పటికే నోటిఫికేషన్‌ను జారీ చేయటం, ఆ పేరు మార్పుపై అభ్యంతరాలకు ఇచ్చిన గడువు కూడా ముగుస్తున్న క్రమంలో ఇక బీఆర్ఎస్ అధికారిక ప్రకటన, ఆవిర్భావ సభ లాంఛనమే అని తెలంగాణ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీలో ఉన్న సీనియర్లతోపాటు ఇతర పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక నేతలను బీఆర్ఎస్లోకి చేర్చుకోవటం ద్వారా దాన్ని మరింత బలోపేతం చేయాలని కారు సారు భావిస్తున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలపై పట్టు, ఢిల్లీలోని వివిధ పార్టీల నేతలతో పరిచయాలున్న నేతలతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ ప్రభాకరరావును పార్టీలోకి చేర్చుకునే అంశంపై సీఎం దృష్టి సారించారనే వార్తలొస్తున్నాయి. పీవీ గతంలో ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పని చేసిన సమయంలో ప్రభాకరరావు ఆయనకు కార్యకలాపాల పర్యవేక్షకుడిగా, సలహాదారుగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినా... జాతీయ నేతలతో విస్తృత పరిచయాలుండటంతో ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్కు సంబంధించి ఒక్క కేసీఆర్‌కు మాత్రమే జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవముంది. అనేక మంది నేతలు గతంలో, ఇప్పుడూ ఎంపీలుగా ఉన్నప్పటికీ వారికి ఢిల్లీ రాజకీయాలతో సంబంధాలు తక్కువే. వివిధ పార్టీల్లోని సీనియర్లపై కేసీఆర్ కన్నేయటానికి ఇది కూడా ఒక కారణమని గులాబీ పార్టీలోని జూనియర్లు చెబుతుండటం గమనార్హం.