Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాట్లుగా మారిన సాగు భూములు
- అడ్డాకుల దగ్గర సర్వే తర్వాత స్థలం మార్పు
- మన్నెంకొండకు తరలింపు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్నగర్లో విమానాశ్రయం ఏర్పాటు ఎప్పుడో కానీ.. దాన్ని ఇప్పటికే రెండు చోట్లకు మార్చడంతో రియల్ వ్యాపారుల పంట మాత్రం పడుతోంది.. రెండు చోట్ల సాగు భూములన్నీ ప్లాట్లుగా మారాయి. మినీ విమానాశ్రయానికి సంబంధించి కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.. అడ్డాకుల మండలం గుడిబండ వద్ద నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. సుమారు 500 ఎకరాల్లో మినీ విమానాశ్రయం అంటూ హడావుడి చేసింది.. ఇంకేం రియల్ ఎస్టేట్ వ్యాపారులు గద్దల్లా వాలిపోయారు.. వందల ఎకరాల సాగు భూములన్నీ ప్లాట్లుగా మారాయి.. చివరకు విమానాశ్రయాన్ని మన్నెంకొండ- దేవరకద్ర మధ్యలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ పోర్టు సంగతేమోగానీ ఆయా ప్రాంతాల్లో సాగుభూములు అన్నీ రియల్ ఎస్టేట్ మయమయ్యాయి. పేద రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉండటం గమనార్హం. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు సన్నాహాలు చేశారు. సుమారు 500 ఎకరాల్లో మినీ విమానాశ్రయం రూపుదిద్దుకోబోతోందన్నారు. ఇప్పుడేమో అక్కడి నుంచి మన్నెంకొండకు మార్చారు. పాలమూరులో త్వరలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రకటనతో సాగు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే పారిశ్రామిక రంగంతోపాటు ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే వందలాది ఎకరాల సాగు భూములను రియల్ వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. తాజాగా విమానాశ్రయం ప్రతిపాదనను అడ్డాకుల నుంచి మన్నెంకొండ దేవరకద్ర మధ్యలోకి మార్చారు. దీనికి కారణం.. అడ్డాకుల దగ్గర గుట్టలు, విద్యుత్తు లైన్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి నీళ్లు వస్తే ఈ ప్రాంతం జలమయం అవుతుందని విమానాశ్రయాన్ని మన్నెంకొండ దగ్గరకు మార్చామంటున్నారు.
మన్నెంకొండ దగ్గర ఇప్పటికే 25 ఎకరాలు ఖరీదు చేసినట్టు తెలుస్తుంది. మరో 300 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడా విమానాశ్రయం ఏర్పాటు చేస్తారో లేదో కానీ పేదల భూములు మాత్రం పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఎకరాకు రెండు కోట్లకు పైగా విలువ ఉండే భూములను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరా రూ.10 లక్షలలోపే కొనుగోలు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. అడ్డాకుల, మన్నెంకొండ ప్రాంతాల్లో కలిసి ఇప్పటికే రెండు వేల ఎకరాలకు పైగా రియల్ వ్యాపారస్తులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఎకరం, అర ఎకరం ఉన్నోళ్ల దగ్గర నుంచి బలవంతంగా భూములు కొనుగోలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. మొదట అడ్డాకుల ప్రాంతంలో కొనుగోలు చేశారు. పేదల భూములను కొనుగోలు చేసి బడా వ్యాపారస్తులకు అమ్మేశారు. ఇప్పుడు అక్కడ పేదల చేతుల్లో భూమి లేకుండా పోయింది. తాజాగా విమానాశ్రయాన్ని మన్నెంకొండ -దేవరకద్ర మధ్యకు మార్చుతున్నట్టు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తిరిగి మన్నెంకొండ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ భూ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. చిన్న కమతాలు ఉన్న వారిని గుర్తించి వారి తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు చోట్లకు మారిన విమానాశ్రయం ఇక్కడైనా నిర్మిస్తారో లేదోనని స్థానికులు చర్చించు కుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.