Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను మోసం చేస్తున్నది : కేంద్ర బీజేపీ సర్కారుపై పల్లా విమర్శలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్దికోసమే పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చిందని రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అందుకే క్రమంగా లబ్దిదారుల సంఖ్యను తగ్గిస్తున్నదని చెప్పారు. తద్వారా ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులకు కేంద్రం ఏ ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి పల్లా విలేకర్లతో మాట్లాడారు. మొదట పీఎం కిసాన్ లబ్దిదారుల సంఖ్యను 11.5 కోట్లుగా గుర్తించిందన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఏకంగా 99 శాతం,ఛత్తీస్‌ఘడ్‌లో 94 శాతం మందిని తగ్గించిందని విమర్శించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్రలో గత ఆరునెలల్లో 1,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మోడీకి లేఖలు రాసి మరీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సాగు చట్టాల రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కనీస మద్దతుల ధర కమిటీలో ఆర్ఎస్ఎస్కు చెందిన వారినే నియమించారనీ, వారికి రైతు సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. రైతు పోరాట సమయంలో మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అందుకే మరో పోరాటానికి రైతులు సిద్ధమవుతున్నారని కేంద్రాన్ని హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలకు టీఆర్ఎస్ మద్దతు ఉంటుందన్నారు.