Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు గంటల పాటు శ్రీనివాస్‌ను విచారించిన సిట్
- ముగ్గురు నిందితులను వారం పాటు తమ కస్టడీకివ్వాలని కోర్టులో పిటిషన్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోనే సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో లాయర్ శ్రీనివాస్‌ను రెండోరోజు మంగళవారం ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. సోమవారం తొలిరోజు శ్రీనివాస్‌ను విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టటానికి రెండో రోజూ విచారించినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో సభ్యులైన నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కలిమేశ్వర్ లతో కూడిన బృందం శ్రీనివాస్‌ను విచారించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరుకు సన్నిహితుడిగా చెప్పబడే శ్రీనివాస్ నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిపిన రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందగోపాల్లతో ఉన్న సంబంధాల గురించి ప్రత్యేక విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా, సింహయాజి స్వామిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకురావటానికి శ్రీనివాస్‌ను ఎవరు కోరారు? అందుకు అవసరమైన డబ్బులను ఎవరు వెచ్చించారు? సింహయాజితో ఆయనకు ఎన్నేండ్ల నుంచి పరిచయం ఉన్నది? అనే పలు కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం. దాదాపు ఏడు గంటలు విచారించిన తర్వాత కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తాను కేవలం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు పీఠాధిపతి అయిన సింహయాజి స్వామి రావటానికి ఫ్లైట్ టికెట్ మాత్రమే ఏర్పాటు చేశానని ఆయన తెలిపాడు. అలాగే, తనకు బీజేపీతోనూ ఎలాంటి సంబంధాలూ లేవనీ, టికెట్ ఖరీదు చేసి ఇచ్చినంత మాత్రాన తనకు ఈ కేసుతో సంబంధాలున్నాయని చెప్పటం సబబు కాదని శ్రీనివాస్ అన్నాడు.
ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి స్వామి, నందకుమార్‌లను విచారించటానికి ఐదురోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇప్పటికే రెండ్రోజుల పాటు ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని సిట్ అధికారులు విచారించారనీ, మరోసారి కస్టడీకి ఇవ్వాల్సినవసరం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కాగా, తమకు మరింత సమాచారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల నుంచి రావాల్సి ఉన్నదనీ, అందుకే కస్టడీకి కోరుతున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అనంతరం వీరి కస్టడీపై నిర్ణయాన్ని కోర్టు నేటికి (బుధవారం) వాయిదా వేసింది. అలాగే, ఈ కేసులో నోటీసులు పంపినప్పటికీ.. విచారణకు రాని కేరళకు చెందిన తుషార్‌తో పాటు డాక్టర్ జగ్గు స్వామి ల కోసం సిట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.