Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలను పునరుద్ధరించాలి
- సమస్యలు పరిష్కారం కాకపోతే మరోసారి దీక్షకు సిద్ధం : ఈయూ రాష్ట్ర కౌన్సిల్లో కూనంనేని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీని పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్పైన్నే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతించాలనీ, బకాయి ఉన్న పేస్కేల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీనగర్లో నిర్వహించిన టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశమంలో కూనంనేని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ పోరాడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనపైన్నే టీఎస్ఆర్టీసీని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నదని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా సీపీఐ మద్దతు కోరినప్పుడు ఇదే అంశాన్ని స్పష్టం చేశామనీ, అందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. ఇప్పటికే సగం డిమాండ్ పరిష్కరించారనీ, మిగతా సగం కూడా పరిష్కారమవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. వాటిలో ముఖ్యమైనవి ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం, రెండు సార్లు బకాయి ఉన్న పీఆర్సీ అమలు చేయాలని కోరారు. కార్మిక సంఘాలు పెట్టుకోగా అనేది చట్టం కల్పించిన హక్కు అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే ఆర్టీసీ పేస్కేల్కు సంబంధించి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. ఆర్టీసీలో అన్ని సంఘాలకు తల్లి సంఘం ఎంప్లాయీస్ యూనియన్ అనీ, ఆర్టీసీ పుట్టక ముందే ఈ యూనియన్ పుట్టిందన్నారు. ఇక్కడ ఎన్ని సంఘాల ఉన్నప్పటికీ సంస్థను, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతున్నది ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఎన్ఎంయూ రంగుల మార్చేదనీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడే అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. తర్వాత తెలంగాణలో టీఎంయూగా మారి అధికార పార్టీకి అనుబంధంగా మారిందని విమర్శించారు. కానీ అదిరింపులు, బెదిరింపులకు లొంగకుండా, కేసులు, సస్పెన్షన్లకు భయపడకుండా నడుస్తున్న సంఘం ఎంప్లాయీస్ యూనియన్ అని చెప్పారు. గతేడాది యూనియన్ నాయకుడు రాజిరెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేయాలని చూస్తే తామంతా అండగా నిలిచామన్నారు. ఆర్టీసీతో కమ్యూనిస్టు పార్టీది పేగు బంధమనీ, కార్మికుల సమస్యలు, హక్కులు, పోరాటాలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు వీఎన్ బోస్, అధ్యక్షులు ఎస్.బాబు, కె.రాజిరెడ్డి, పద్మాకర్ తదితరులు ప్రసంగించారు.