Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్వస్థతకు గురైన విద్యార్థులు
- ఆస్పత్రికి తరలింపు
- అధికారులపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం
నవతెలంగాణ-కొత్తగూడ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన స్పోర్ట్స్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గిరిజన స్పోర్ట్స్ మోడల్ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆదివారం చికెన్‌తో భోజనం పెట్టారు. భోజనం చేసిన విద్యార్థులకు సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు చెప్పడంతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు హాస్టల్లో ఉన్న మాత్రలు ఇచ్చారు. సోమవారం సైతం ఇదే పరిస్థితి ఏర్పడటంతో ఈ విషయాన్ని అధికారులు బయటికి పొక్కనివ్వలేదు. కాగా మంగళవారం విద్యార్థులకు విరేచనాలు ఎక్కువకావడంతో హుటాహుటిన ఉపాధ్యాయులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. స్పందించిన వైద్యాధికారి ముక్రం విద్యార్థులకు వైద్యం అందించారు. ఈ ఘటనపై గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క స్పందించారు. కలెక్టర్, అధికారులు, వైద్యులతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాలకు చేరుకుని ఫుడ్ పాయిజన్‌కు కారణాలు, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.