Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్
నవతెలంగాణ- ముషీరాబాద్
నవ తెలంగాణ సంస్థకు రెడ్యా నాయక్ అందించిన సేవలు చిరస్మరణీయమని నవ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ అన్నారు. రెండ్రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందిన నవతెలంగాణ సీనియర్ అకౌంటెంట్ రెడ్యానాయక్ సంస్మరణ సభ మంగళవారం నవ తెలంగాణ హెడ్ ఆఫీస్(ఎం.హెచ్ భవన్)లో ప్రింటింగ్ జనరల్ మేనేజర్ రఘు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ సుధా భాస్కర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీజీఎం ప్రభాకర్ మాట్లాడుతూ.. 1996 నుంచి క్యాషియర్‌గా, సీనియర్ అకౌంటెంట్‌గా రెడ్యానాయక్ సంస్థలో పని చేశారని చెప్పారు. నవతెలంగాణ సంస్థ పట్ల ఆయన అంకిత భావంతో పనిచేసినట్టు కొనియాడారు. ప్రతి అంశం పట్ల జవాబుదారీగా వ్యవహరించేవారని తెలిపారు. ఎడిటర్ సుధా భాస్కర్ మాట్లాడుతూ.. దాదాపు 26 సంవత్సరాలపాటు సంస్థకు సేవలు అందించిన రెడ్యా నాయక్ అకాలమరణం నవతెలంగాణకు తీరని లోటన్నారు. ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సిబ్బందికి సూచించారు. రెడ్యా నాయక్ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆయన కుటుంబానికి తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సిబ్బందీ మనకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు ఆర్.వాసు, శశి, వెంకటేష్, నరేందర్ రెడ్డి, మేనేజర్లు ఉపేందర్, గురు దీప్, రేణుక, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు వేణు, సంస్థ ఉద్యోగులు పాల్గొని రెడ్యా నాయక్‌కు నివాళులర్పించారు.