Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకుల డిమాండ్
- ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇల్లు కట్టుకోవడం కోసం ఐదు లక్షలివ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు మంగళవారం హైదరాబాద్లోని సరూర్నగర్ మండల ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జయశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి, ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఎమ్మార్వో స్పందిస్తూ.. సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముందు కూడా నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కమిటీ నాయకులు, మల్కాజిగిరి మండల ప్రధాన కార్యదర్శి బంగారు నర్సింగరావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కృపాసాగర్, ఐద్వా మండల కార్యదర్శి బి.మంగ తదితరులు పాల్గొన్నారు.