Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్టాండ్‌లో తోపుడుబండి తాకడంతో పేలిన బాంబు
- కార్మికునికి తప్పిన ప్రాణాపాయం
- ఐదు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- విచారణ జరుపుతున్న పోలీసులు
నవతెలంగాణ-హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన హుస్నాబాద్‌లో నాటు బాంబులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం హుస్నాబాద్ బస్టాండ్‌లో బాంబు పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. పార్సిళ్లు తీసుకెళ్లేందుకు వచ్చిన తోపుడుబండి తాకడంతో ఒక్కసారిగా బాంబు పేలింది. బాంబు పేలినట్టు గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ వాసాల సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి బాంబుస్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఐదు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాటుబాంబులు ఇక్కడికి ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు. బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజుల కిందట కూడా ఒక బాంబు పేలిందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఎవరో టపాకాయలు కాల్చారేమోనని అనుకున్నామంటున్నారు. కాగా, బస్టాండ్‌లో దొరికిన నాటుబాంబులు అడవిపందులను చంపేందుకు ఉపయోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అడవిపందులతో పాటు ఊరపందులను ఇలాంటి బాంబులతోనే చంపుతారంటున్నారు. అయితే బస్టాండ్‌లో ఎందుకు పడేశారనే అనుమానాలు వస్తున్నాయి. హుస్నాబాద్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుబడతామేమోననే భయంతోనే ఎవరో బస్టాండ్‌లోని నిర్జన ప్రదేశంలో బాంబులను పడేసి ఉంటారని భావిస్తున్నారు.