Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వపరంగా సహకరిస్తాం :సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా వారిని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బీఆర్కె భవన్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆప్ మైగ్రేషన్ (ఐఒఎం), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ప్రతినిధులు సీఎస్‌తో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా తిరిగొస్తున్న వలస జీవులకు అందించాల్సిన సహకారంపై చర్చించారు. సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం టామ్ కామ్‌ను స్థాపించి నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉద్యోగాలు మన యువతకు దక్కాలంటూ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా నర్సులకు ఇప్పటికే శిక్షణ మొదలు పెట్టామనీ, మిగిలిన రంగాల్లో కూడా శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. వలసలు పోయే పనివారల కోసం ప్రభుత్వం సుస్థిరమైన కార్యక్రమాలతో అనువైన వాతావరణం కల్పించిందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఐఒఎం ప్రధాన కార్యాలయ అధిపతి సంజయ్ అవస్థి, ఐఎల్ఒ డైరెక్టర్ డగ్మర్ వాల్టర్ తదితరులు పాల్గొన్నారు.