Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పనిసరైన సుప్రీంకోర్టు ఆదేశాల అమలు
- ప్రభుత్వ జోక్యం కోసం ఉద్యోగ సంఘాల ఎదురుచూపులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో మరోసారి ఉద్యోగులకు ఇచ్చిన ప్రమోషన్లను రద్దు చేశారు. దాదాపు 250 మందికి ప్రమోషన్లు ఇస్తే, సీనియారిటీ, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారిలో దాదాపు 143 మందికి రివర్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. కొందరికి డబుల్ రివర్షన్లు కూడా ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలోనూ విద్యుత్ సంస్థల్లో ఇలాగే ఇచ్చిన ప్రమోషన్లను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్రా స్థానికత పేరుతో 1,157 మందిని విధుల నుంచి రిలీవ్ చేయడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం, జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఏర్పాటు, కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో ఆయా తీర్పుల అమలులో భాగంగా మరోసారి పదోన్నతి పొందిన రాష్ట్ర ఉద్యోగులకు రివర్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. కోర్టు తీర్పుల అమల్లో భాగంగా తాజాగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంధ్రా స్థానికత పేరుతో గతంలో రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి సీనియారిటీ సర్వీసును కూడా పరిగణిస్తూ, గతంలో ఇచ్చిన పదోన్నతులను రివర్షన్ చేశారు. దీనితో ఇప్పటి వరకు సీఈ స్థాయిలో పనిచేసిన అధికారులు ఈఈ స్థాయికి డబుల్ రివర్షన్లు పొందాల్సి వచ్చింది. నలుగురు సీఈలు, 30 మందికి పైగా ఎస్ఈలు, 120 మంది డిఈల పదోన్నతులు రద్దు అయ్యాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఈ జాబితాలను తమ వెబ్సైట్లలో సోమవారం అర్థరాత్రి దాటాక పెట్టాయి. కొన్ని పోస్టుల్లో మాత్రం గతంలో ఇచ్చిన పదోన్నతులను రద్దు చేసి, సీనియారిటీ, రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకొని మళ్లీ అదే పోస్టుల్లో వారినే నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రద్దు చేసిన పదోన్నతుల్లో మాత్రం ఇంకా ఎవర్నీ నియమించలేదు. కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు తప్పనిసరై ఇచ్చిన పదోన్నతులను రివర్షన్ చేయాల్సి వచ్చినట్టు చెప్తున్నాయి. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో ఈ రివర్షన్లు జరిగాయి. పలు కీలక పోస్టుల్లో సీనియారిటీ, రోస్టర్ విధానంలో ఏపీ స్థానికత ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. అయితే దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని ఇప్పటికే ఇంజినీర్ల సంఘాలు ప్రభుత్వానికి నివేదించాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి, నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.