Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకే దాడి : సెక్షన్ ఆఫీసర్
- ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
- మృతుని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా
- కుటుంబలో ఒకరికి ఉద్యోగం
- ఘటనపై విచారణకు డీజీపీకి ఆదేశాలు
నవతెలంగాణ-చండ్రుగొండ
ఫారెస్ట్ రేంజర్‌పై వలస ఆదివాసీల (గుత్తి కోయలు) మంగళవారం దాడి చేసిన ఘటనలో ఫారెస్టు రేంజర్ చలమల శ్రీనివాసరావు మృతి చెందారు. సెక్షన్ ఆఫీసర్ రామారావు కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు శివారు గ్రామంలోని ఎర్రబోడులో అటవీ శాఖ అధికారులు నాటిన ప్లాంటేషన్లను పరిశీలించేందుకు ఫారెస్టు రేంజర్ చలమల శ్రీనివాసరావు(45), సెక్షన్ ఆఫీసర్ రామారావు మంగళవారం మోటర్ సైకిల్‌పై వెళ్లారు. ఒక ప్లాంటేషన్‌లో 30 మంది కూలీలకు మొక్కల పెంపకంపై డెమో ఇచ్చి తిరిగి చండ్రుగొండకు బయలుదేరారు. ఆ సమయంలో ఎర్రబోడు వద్దగల ప్లాంటేషన్‌లో మొక్కలను వలస ఆదివాసీలు పశువులతో మేపుతున్నారని, వద్దని చెప్తే కొట్టడానికి వస్తున్నారని వాచర్ రేంజర్‌కి ఫోన్ చేసి చెప్పాడు.
రేంజర్, సెక్షన్ ఆఫీసర్‌కి వెహికల్ తిప్పమని ప్లాంటేషన్ వద్దకు వెళ్లారు. ప్లాంటేషన్‌లో మేస్తున్న పశువులను సెక్షన్ ఆఫీసర్, వాచర్లు బయటికి కొడుతుండగా రేంజ్ వీడియో తీస్తూ నిలబడ్డారు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన కొందరు వలస ఆదివాసీలు కత్తితో మెడపై దాడి చేయగా రేంజరు కేకలు వేస్తూ కిందపడ్డాడు. సెక్షన్ ఆఫీసర్, వాచర్లు వచ్చి వలస ఆదివాసీల కాళ్లు పట్టుకొని దాడి చేయ వద్దని బతిమిలాడటంతో వదిలేసి వెళ్లి పోయారు. అప్పటికే రక్తపు మడుగులో పడి స్పృహ తప్పి పడిపోయిన రేంజర్‌ను ప్రత్యేక కారులో చండ్రుగొండ పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే బీపీ, పల్స్ డౌన్ అయ్యి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు, జూలూరుపాడు సీఐ వసంత కుమార్, ఎస్ఐ విజయలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో చంద్రుగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వలస ఆదివాసీల దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిందితులకు శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. డ్యూటీలో ఉండగా మరణిస్తే వర్తించే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్మెంట్ వయస్సు వరకు వారి రికుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. ఎఫ్ఆర్వో మృతదేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఎఫ్ఆర్వోలు అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశిం చారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా, ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
భూమిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దాడి
చండ్రుగొండ మండలంలోని బెండలపాడు శివారు గ్రామంలోని ఎర్రబోడు సమీపంలో పోడు భూమిని వలస ఆదివాసీలు సాగు చేసుకొని జీవనం సాగించారు. ఈ ఏడాది జూన్ నెలలో ప్రభుత్వ ఆదేశాలతో ఫారెస్టు రేంజర్ చలమల శ్రీనివాసరావు, ఫారెస్టు అధికారులతో కలిసి రైతులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకొని ప్లాంటేషన్లను ఏర్పాటు చేశారు. తమ పొట్ట కొట్టొదని వలస ఆదివాసీలు వేడుకున్నా అధికారులు వినలేదు. వారిపై కేసులు కూడా నమోదుచేశారు. నాటి నుంచి వలస ఆదివాసీలు తమ భూమి అంటూ అక్కడే పశువులను మేపుతున్నారు. ఒకటి రెండు సార్లు అటవీ శాఖ అధికారులు, వలస ఆదివాసీలకు మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. తమ భూమిని తమకు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా ససేమిరా అన్నట్టు తెలిసింది. పలుమార్లు ఫారెస్టు రేంజర్ రైతులపై దాడి చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేయడం.. సర్వే కూడా అధికారులు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ భూమిని స్వాధీనం చేసుకోకుంటే తమకూ పట్టాలు వచ్చేవన్న ఆశ వారిలో ఉంది. ఆ స్థాయిలో దాడి జరగడానికి ఇదొక కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో ఇద్దరే వలస ఆదివాసీలు ఉన్నారని సమాచారం.
రేంజర్ శ్రీనివాసరావు హత్యను ఖండిస్తున్నాం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం లో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావును హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కమిటీ ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండి స్తుందని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు. ఇటువంటి పద్ధతులు అనుసరించడం సరియైనది కాదన్నారు. హత్య చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.