Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు రక్షణ కల్పించేలా సీఎంతో చర్చిస్తాం
- టీజీవో చైర్మెన్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబోదులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుంటే అడ్డుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావుపై గుత్తికోయలు కత్తులతో దాడి చేయడాన్ని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) సంఘం చైర్మెన్, వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ ఖండించారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో టీజీవో సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అమానుష చర్యపై విచారం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు మున్ముందు జరగకుండా సీఎం కేసీఆర్‌తో చర్చించి అధికారులకు తగిన రక్షణ కల్పించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు. టీజీవో అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, అధికారులపై ఇలాంటి దాడులు జరిగితే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు మరణం దురదృష్టకరమనీ, సంతాపం తెలియజేస్తున్నామనీ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా, జీవితకాలం జీతభత్యాలు ప్రకటించి ఈ అమానుష దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణాయాదవ్, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు రాజారమణారెడ్డి, జోజో, విజయనందరావు, లావణ్య, గోపి, చంద్రశేఖర్‌గౌడ్, జాన్ తదితరులు పాల్గొన్నారు.