Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య విలువలకు వన్నెలద్దిన కవులు, రచయితలు
- సినీరచయితల వివరాలతో సినీతావరణం పుస్తకావిష్కరణ
- జానపదాలు, సినీగీతాలు, కవితలపై సుధీర్ఘ చర్చలు
- విజయవంతంగా ముగిసిన లిటరరీ ఫెస్ట్-2022
- పాటకు జేజేలు పలికిన పలువురు ప్రముఖులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అక్షరం పుట్టకముందే పురుడుపోసుకున్న పాటకు సాహితీలోకం పట్టాభిషేకం చేసింది. తెలంగాణగడ్డలోని రచయితల నుంచి జాలువారిన పాటల పరిమళాలను ఆస్వాదించింది. ఉద్యమ పాటలను మననం చేసుకున్నది. ఏ విప్లవానికైనా, పోరాటానికైనా దారిచూపిందీ, ప్రేరణగా నిలిచిందీ పాటేనని స్పష్టం చేసింది. పాటకు జేజేలు థీమ్‌తో తెలంగాణ సాహితీ ఈ ఏడాది నిర్వహించిన లిటరరీ ఫెస్ట్-2022 మూడు రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది. జానపదాలు, సినీగీతాలు, కవితలపై మేధోమథనానికి వేదికైంది. యువ పాటల రచయితలను పరిచయం చేసింది. తమ పదునైన అక్షరాలతో కూర్చిన పాటల ద్వారా సాహిత్య విలువలకు వన్నెలద్దిన కవులు, రచయితలను గుర్తుచేసుకున్నది. దాదాపు వందమంది సినీ పాటల రచయితలపై రీసెర్చ్ స్కాలర్స్ సేకరించిన విలువైన సమాచారంతో ముద్రించిన సినీగీతావరణం పుస్తకం సినీ, పాటల ప్రియులకు కరదీపికగా ఉపయోగపడనుంది. యువ రచయితలకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో, మలిదశ ఉద్యమంలో పాట పోషించిన పాత్ర గురించి చర్చ నడిపింది. ఉద్యమ పాటలకు పుట్టినిల్లయిన తెలంగాణ గడ్డ..మతసామరస్య అడ్డా అని చాటిచెప్పింది. సమాజ మార్పులో సాంస్కృతిక విప్లవం ఆవశ్యకత ఎంత అవసరముందో సాహితీ లోకానికి విడమర్చి చెప్పడంలో ఫెస్ట్ విజయవంతమైంది. విడివిడిగా ఉన్న భావాలను ఒక దగ్గరకు చేర్చి రంగరించి పాటల సింగిడిగా మార్చటంలో ఫెస్ట్ లక్ష్యం నెరవేరింది. విప్లవ మార్గానికి సంగీతమనే శక్తిని ఏవిధంగా ఉపయోగించుకోవాలనే దానిపై సమాలోచనలు జరిగాయి. పాటపై మూడు రోజుల పాటు ఫెస్ట్ నిర్వహించిన తెలంగాణ సాహితీ కృషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రపంచంలో మహిళా గేయ రచయితలకు సరైన అవకాశాలు ఇవ్వకపోవడంపైనా, వివక్షపైనా పలువురు రచయితలు ఎత్తిచూపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, సినీ ప్రముఖులు, పాటల రచయితలు నందిని సిధారెడ్డి, మాదాల రవి, జేకే భారవి, కె.దేవేంద్ర, తిరునగరి శరత్ చంద్ర, విమలక్క, స్ఫూర్తి, సాంబరాజు యాదగిరి, ఎల్బీ శ్రీరామ్, మద్దూరి ఐలయ్య, తదితర ప్రముఖులు యువరచయితలకు దిశానిర్దేశం చేశారు. ఫెస్ట్ ప్రారంభకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్, ప్రసిద్ధ పాత్రికేయులు, సాహితీ, సినీ విమర్శకులు తెలకపల్లి రవి, భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సామాజిక కార్యకర్త పీఏ దేవి, కవి యాకూబ్, తదితరులు..సమాజ మార్పు కోసం యువ రచయితలు సాహిత్యంలో పాటించాల్సిన మెళుకువలను చెప్పారు. తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. పద్మశ్రీగ్రహీత కిన్నెర మొగిలయ్య తన జీవితాన్ని పంచుకున్నారు. వంద మందికిపైగా కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఆ కవితలు అందర్నీ ఆలోచింప జేశాయి. పలువురు రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులు సినీ గేయ రచయితల మీద పత్ర సమర్పణలు చేశారు. అంతిమంగా మూడు రోజుల పాటు తెలంగాణ సాహితీ నిర్వహించిన లిటరరీ ఫెస్ట్ పాటకు జేజేలు పలికింది. ముగింపు సభలో మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్, కవి ఏనుగు నర్సింహారెడ్డి సాహిత్యంలో పాటకున్న గొప్పతనాన్ని ఫెస్ట్ ప్రతినిధులకు వివరించారు. స్వయంగా పాడారు. కవి వీఆర్ తూములూరి రాసిన 'దేశానికో అశ్రులేఖ' కవితా సంకలనాన్ని ఫెస్ట్ కవి యాకూబ్ ఆవిష్కరించారు.