Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ విషయంలో న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు
- విచారణకు బీజేపీ నేతల డుమ్మా కొట్టారని తెలిపిన అడ్వకేట్ జనరల్
- సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇవ్వాలని వినతి
- విచారణ నేటికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రయత్నాలు కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేస్తున్న విచారణకు ఎందుకు హాజరుకాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తునకు సహకరిస్తామని గత విచారణలో సంతోష్ తరఫు న్యాయవాది కూడా చెప్పారని గుర్తు చేసింది. సిట్ అరెస్టు చేస్తుందనే భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అరెస్టు చేయరాదని అప్పుడే మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నామని, అయినా, సిట్ దర్యాప్తునకు ఎందుకు హాజరుకాలేదని నిలదీసింది. సిట్ విచారణకు సంతోష్ హాజరుకావాలని సూచించింది. నిందితులు దాఖలు చేసిన రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. సిట్ దర్యాప్తు స్వేచ్ఛగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసిందనీ, నిందితులు బెయిల్ పిటిషన్లు హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలని చెప్పిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతులను అందజేసిన తర్వాతే ఈ కేసులో ముందుకు వెళతామని చెప్పింది. రెండు ఎస్ఎల్పీల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతుల పరిశీలన నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎర కేసును సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సిట్ నోటీసులు జారీ చేసినా విచారణకు సంతోష్ ఇతరులు హాజరుకాలేదని తెలిపారు. సిట్ ఇచ్చిన 41ఎ నోటీసులు వారికి అందాయన్నారు. సిట్ దర్యాప్తునకు హైకోర్టే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తునకు హాజరుకాకపోతే చట్ట ప్రకారం ముందుకు వెళ్లేందుకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయని చెప్పారు. సాక్షలు, అనుమానితులకు 41ఎ నోటీసులు జారీ చేశాక సిట్ దర్యాప్తునకు సహకరించకపోతే తదుపరి చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తులో లభ్యమైన సాక్ష్యాధారాల తర్వాతే సంతోశ్, ఇతరులకు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ నెల 20న సంతోశ్‌కు సీఆర్పీసీలోని సెక్షన్ 41ఎ నోటీసు జారీ అయ్యిందన్నారు. సీఐబీ దర్యాప్తునకు ధర్మాసనం నిరాకరించిందని, న్యాయపరంగా చేసిన పోరాటంలో అన్ని దశల్లోనూ ఎదురుదెబ్బలు తగిలినా కూడా సిట్ విచారణకు హాజరకాలేదన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతున్నదనీ, అయినా, విచారణకు హాజరుకాకపోవడం సిట్‌కు సహకరించకపోవడమే అవుతుందని తెలిపారు. సిట్ విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆఫీసులో సంతోష్‌కు సిట్ నోటీసుల కాపీని అందజేశారన్నారు. సంతోశ్ బీజేపీలో ప్రముఖ నేతనీ, జాతీయ స్థాయి రాజకీయాల పర్యవేక్షణ చేస్తుంటారనీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారనీ ఆయన న్యాయవాది బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. సిట్ దర్యాప్తునకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఏజీ ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించాల్సివుందని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను నివేదించాలని ఏజీని ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాతే విచారణలో ముందుకు వెళతామని స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు సిట్ దర్యాప్తు ఆపాలనీ, మొయినాబాద్ ఫాంహౌస్ కేసు సీబీఐకి ఇవ్వాలని జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు మంగళవారం రిట్ దాఖలు చేశారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీల తరఫున ఒక న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణ చేయనుంది.
హిల్‌ఫోర్ట్ పనులపై హైకోర్టు విచారణకు హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్, టూరిజం శాఖ ఎమ్డీ, హెచ్ఎండీఏ వీసీ హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడం హిల్‌ఫోర్టు పునరుద్ధరణ పనులు ఏవిధంగా చేస్తారో నివేదిక అందజేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హిల్‌ఫోర్ట్ పనులు చేయకపోవడంపై దాఖలైన పిట్‌ను చీఫ్ జస్టిస్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. గత ఆదేశాల మేరకు విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్, టూరిజం శాఖ ఎమ్డీ, హెచ్ఎండీఏ వీసీలు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పునరుద్ధరణ పనులకు రూ.50 కోట్ల కేటాయింపులకు అనుగుణంగా చేయబోయే పనులపై రిపోర్టు ఇవ్వాలనీ, డిసెంబర్ 6న జరిగే విచారణకు కూడా అధికారులు వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.