Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవాలి
- అన్నమయ్య సమానత్వ స్ఫూర్తి కొనసాగాలి
- ఆయన ఇల్లు, గుడి, మండపాల్ని పునర్నిర్మించాలి
- 'నవతెలంగాణ'తో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి
జానపద కళాకారుల్ని ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలనీ, కళా సంస్కృతుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి కోరారు. హిందూ ధర్మంలో తాళ్లపాక అన్నమాచార్య సమానత్వ స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్న ఆయనతో 'నవతెలంగాణ' ప్రత్యేక ఇంటర్వ్యూ...
నవతెలంగాణ- మీరేదో రధయాత్ర చేస్తున్నారు... ఏంటి దాని లక్ష్యం?
స్వామి : తిరుమల కొండపై 2003లో తాళ్లపాక ఆన్నమాచార్య ఇంటినీ, ఆయన పూజా మందిరం, స్వహస్తాలతో పూజించిన ఆంజనేయస్వామి గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కూల్చివేశారు. ఇది వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచింది. అప్పట్లో వాటిని పునర్నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. టీటీడీ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖపై ఒత్తిడి పెంచేందుకు అన్నమయ్య గృహ సాధన చైతన్య రధయాత్ర ప్రారంభించాం. ఇప్పటికి 6వేల కిలోమీటర్లు తిరిగాం. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి మరో 4వేల కి.మీ., తిరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
మేం ఊహించిన దానికంటే అద్భుత స్పందన వస్తున్నది. మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అన్నమయ్య గృహ సాధన కోసం ఈ యాత్రలో 10 లక్షల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 11.50 లక్షలమంది సంతకాలు చేశారు.
అన్నమయ్య ఇల్లు, మండపం, మందిరం పునర్నిర్మాణం చేస్తే, దానివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏముంది?
అన్నమయ్య వ్యక్తి కాదు. ఆయనో ఆధ్యాత్మిక సమతా శక్తి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే...అంటూ అప్పట్లోనే పండితుడినీ, ఛండాలుడిని సమదృష్టితో చూసిన గొప్ప మానవతా మూర్తి. అవే పరిస్థితులు అప్పుడు, ఇప్పుడూ ఒకేలా ఉన్నాయి. అందువల్ల సమాజ మార్పు అనివార్యం. ఆయన రాసిన 32 వేల కీర్తనలను జానపద కళాకారులు ప్రచారం చేస్తున్నారు. ఆ కీర్తనలతో కోట్ల మంది ప్రజలు ఆధ్యాత్మిక సమతా స్ఫూర్తి పొందుతున్నారు.
వీటన్నింటికీ ఓ కేంద్రం అవసరం. అది అన్నమయ్య నివసించిన, ప్రార్థించిన, పూజించిన మందిరాల సముదాయమే సరైన ప్రాంతం. అందుకే పునర్నిర్మాణాన్ని మేం బలంగా కోరుకుంటున్నాం.
అన్నమయ్య కుటుంబ వారసులు ఉన్నారుగా... వారికి లేని కాంక్ష మీకెందుకు?
వారు కూడా నా యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. టీటీడీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అన్నమయ్య నివాస గృహాన్ని భౌతిక వస్తువుగానే చూస్తున్నాయి. ఆయన కీర్తనల ద్వారా స్ఫూర్తి పొంది, భావి తరాలకు దాన్ని అందించాలనే కాంక్షతోనే ఈ యాత్రను చేపట్టాం. అన్నమయ్య భావజాలాన్ని స్వీకరించిన ఎవరైనా ఆ బాధ్యతలు స్వీకరించొచ్చు.
అన్నమయ్య కీర్తనల ప్రచారంలో ప్రభుత్వాల పాత్ర ఎలా ఉంది?
ప్రభుత్వాల పాత్ర చాలా పరిమితంగా ఉంది. దాన్ని విస్తరించాలి. జానపద, సంప్రదాయ నృత్య కళల ద్వారానే హిందుత్వ ప్రచారం జరుగుతుంది. అలాంటి కళాకారులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రతి దేవస్థానంలోనూ అన్నమయ్య నృత్య కళారాధన వేదికలు ఏర్పాటు చేయాలి. కళాకారులకు నెలవారీ నగదు ప్రోత్సాహకం, ఉచిత వసతి, భోజనం ఇతర సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణలో కొద్ది మంది కళాకారులనే ఇక్కడి ప్రభుత్వం ఆదరిస్తున్నది. దేవాదాయశాఖ ఆదాయాన్ని ఇలాంటి కళాకారుల కోసం ఖర్చుచేయాలి. కళా గురువుల వ్యవస్థకు అవసరమైన విధివిధానాలు రూపొందించి, ఆర్థిక తోడ్పాటునివ్వాలి.
భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
మే నెలలో అన్నమయ్య జయంతిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అన్నమయ్య కళాక్షేత్రం, కోవిదా సహ్నదలా ఫౌండేషన్, చినుకు కల్చరల్ సొసైటీల సంయుక్తాధ్వరంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. అక్కడ సాంస్కృతిక సమ్మేళనాలు, ప్రవచనాలు, గురువులకు సన్మానాలు వంటివి ఉంటాయి. అన్నమయ్య చెప్పిన సమాజ సమానత్వ భావనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.