Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయాలు అందుకు వేదికలుగా మారాలి : డాక్టర్ పుష్పకుమార్ జోషి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక ఉద్యోగిని నియమించుకునే సంస్థ ఆ ఉద్యోగికున్న సాంకేతిక నైపుణ్యం, జ్ఞానం ఆధారంగా మాత్రమే నియమించుకోదు. ఆ వ్యక్తి సంస్థ ప్రగతిలో భాగస్వామి కావాలని ఆశిస్తుంది. అందుకోసం అవసరమైన పని వాతావరణం కల్పించడంతో ఆ వ్యక్తి మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతాడు. తనకు నిర్దేశించిన పనికి మాత్రమే పరిమితం కాకుండా సంస్థ ప్రగతికి ఉపయోగపడగలుగుతాడు. ఒక ఉద్యోగి నియామకం అంటే ఆ సంస్థ ఒక మనిషిని పూర్తిగా నియమించు కుంటుందనీ, ఆ విధంగానే ఆ మనిషి సామర్థ్యాన్ని వినియోగించు కోవాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీ డాక్టర్ పుష్ప కుమార్ జోషి తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) చైర్మెన్ డాక్టర్ కె.పద్మనాభయ్య అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా కోణంలో వ్యాపారాభివృద్ధి అనే అంశంపై జోషి ప్రసంగించారు. మనిషి కేవలం జీవనోపాధి కోసం మాత్రమే పని చేయబోడని స్పష్టం చేశారు. అంతకు మించిన సౌలభ్యం, సంతోషం కోసం పరితపిస్తాడనే విషయాన్ని యాజమాన్యాలు గుర్తించాల ని సూచించారు. ఉద్యోగి భావోద్వేగాల స్థాయిని, సాంకేతిక నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఒకరిని సంస్థలో నియమించు కోవడమంటే ఆ మనిషి విలువలన్నింటిని కొనుగోలు చేస్తున్నట్టేననీ, ఆ విలువలే ప్రగతికి సోపానాల న్నారు. ఉదాహరణకు ఒక మెకానికల్ ఇంజినీర్‌ను నియమించుకునే సమయంలో అతనికి ఆ ఉద్యోగిని సంబంధించిన నైపుణ్యతను మాత్రమే పరిగణలోకి తీసుకోలేమనీ, ఆ వ్యక్తిని పూర్తిగా నియమించు కుంటున్నామనే విషయాన్ని గుర్తించు కుంటామని తెలిపారు. మనుషులు సహజంగా నాలుగు రకాలు గా కనిపిస్తుంటారని తెలిపారు. ఊహాలతో కూడిన ఆలోచన, వాస్తవాలతో కూడిన ఆలోచన, రెండింటిని కాదనీ మరో కోణంలో కనిపించడం, ఉమ్మడిగా పని చేసే సందర్భంలో సంక్లిష్టంగా వ్యవహరించడం ఇలా నాలుగు విధాలుగా ఉంటారని వివరించారు. భారతీయుల్లో వారసత్వంగా కొంత ఆధ్యాత్మికత, వినయం, పరిస్థితులను అనుకూలంగా మార్చు కోగలగడం, విలువలతో కూడిన జీవితం కారణంగా ప్రపంచంలో పెద్ద కార్పొరేట్ కంపెనీలను నడిపించగలుగుతున్నారని తెలిపారు.
సాధ్యం కాదు అనుకోవడం సరికాదంటూ ...మనుష్యులను, వారిలోని ప్రతిభను నమ్మగలిగితే ఏదైనా సాధ్యమేనని తేల్చి చెప్పారు. జీవితం పని కన్నా చాలా పెద్దదంటూ అంకితభావానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. తెలివితో వ్యవహరించడం అత్యంత ఆవశ్యకతమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్కి ఇంఛార్జీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నిర్మల్యా జిబాగ్చీ తదితరులు పాల్గొన్నారు.