Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధంలో ముందు సాంస్కృతికంగా గెలవాలి : కవి, అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
- ముగిసిన తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్-2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షిప్తం అనేది తెలివికి ఆత్మ లాంటిదనీ, సంక్షిప్తం అనేది పాటతోనే సాధ్యమవుతుందని ప్రముఖ కవి, మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో లిటరరీ ఫెస్ట్-2022 మూడో రోజూ కొనసాగింది. మంగళవారం సాహితీ ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్ధనను శాలువా, మెమోంటోతో సత్కరించారు. అనంతరం ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యంలో పాట శక్తివంతమైన రూపం అని చెప్పారు. పాటకు మొదటి రూపం జానపద గీతాలు అని తెలిపారు. పాట చరిత్ర వచన కవిత్వ చరిత్ర కంటే పెద్దదన్నారు. చైనా ఫిలాసఫర్ ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకంలో యుద్ధం చేయకుండానే యుద్ధంలో గెలవటం గొప్ప కళ అని చెప్పారన్నారు. యుద్ధంలోగానీ, ఉద్యమంలోగానీ శత్రువును జయించాలంటే మొదట సాంస్కృతికంగా జయించాలని నొక్కిచెప్పారు. అదే సమయంలో శత్రువును జయించటంలో పాట పాత్ర కూడా చాలా కీలకమని చెబుతూ..తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాని పాత్రను వివరించారు. ఉద్యమాలు పురుడుపోసుకోవడానికీ, అవి విజయవంతం అవడానికీ పాట ఒక శక్తిగా దోహదపడుతుందన్నారు. ఆధునిక కాలంలో ప్రజలు చలనశీలురు అయి అనేక ఉద్యమాలు మొదలైనప్పుడు పాట ఒక శక్తిగా లేచిందన్నారు. మనిషి అంతరంగాన్ని తట్టిలేపే శక్తి పాటకుందని కొనియాడారు. పాటకు, వచన కవిత్వానికి వైరుధ్యం లేదన్నారు. గొప్ప పాటగాడు గొప్ప కవి అవుతాడనీ, అదే గొప్ప కవి గొప్ప పాటగాడు కాలేడని చెప్పారు. మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...కవులు, రచయితలు ఎవ్వరికీ తల వంచకుండా ప్రజల మేలు కోసం, సమాజ మార్పు కోసం తమ రచనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కష్టాలు, అణచివేతలు ఎక్కువయ్యే కొద్దీ అక్షరాలు మరింత పదునెక్కి జాలువారుతాయన్నారు. అరసం అధ్యక్షులు రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ..సామాజిక స్పృహతోనే రచనలు చేయాలని కోరారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, అన్నవరం దేవేందర్, షహనాజ్ బేగం, నిర్మల, కపిల రాంకుమార్, ఎస్.లింగమూర్తి, కాసుల రవికుమార్, మందా వెంకట్, కొండ రవీందర్, భానుచందర్, ఫెస్ట్ నిర్వాహకులు రాంపల్లి రమేశ్, శరత్సుదర్శి, సలీమా, ఎ.మోహన్‌కృష్ణ, శరత్చంద్ర, తెలంగాణ సాహితీ హైదరాబాద్ నగర కార్యదర్శి రేఖ, తదితరులు పాల్గొన్నారు. ఉదయం సెషన్లో సినీ రచయిత గుండేటి రమేశ్ మాట్లాడుతూ..తాను రాసిన చీర, దోతి పాటల గురించి చెబుతూ అందులోని చమత్కారాన్ని వివరించారు. మరో రచయిత రామి రెడ్డి మాట్లాడుతూ..ఈ భూమ్మీద పాట లేని చోటే లేదన్నారు. సినీ గేయ రచయిత పింగళి చైతన్య మాట్లాడుతూ..సినీ రంగంలో మహిళా రచయితలు చాలా తక్కువగా ఉన్నారనీ, అవకాశాలు కూడా అంతంత మాత్రమేనని చెప్పారు. అయితే, వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. మహిళలు పాటలు రాయటంపై దృష్టి పెట్టాలని కోరారు.
'దేశానికో అశ్రులేఖ' కవితా సంకలనం ఆవిష్కరణ
లిటరరీ ఫెస్ట్‌లో కవి వీఆర్ తూములూరి రచించిన దేశానికో అశ్రులేఖ కవితా సంకలనాన్ని ప్రముఖ కవి యాకూబ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, కవి, మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఏను నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కవితా సంకలనం గురించి ప్రముఖ కవి కాసుల లింగారెడ్డి పరిచయం చేశారు. వీఆర్ తూములూరి తాత రావెళ్ల వెంకట్రావు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆ పోరాటంలో ఆయన తన గళం, కలం, హలం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారని తెలిపారు. ఆయన పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వీఆర్ తూములూరి తన కవితలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని చెప్పారు.