Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లు, కార్యాలయాలపై దాడులు
- అల్లుడు, బంధువుల నివాసాల్లోనూ సోదాలు
- భారీగా నగదు సీజ్
నవతెలంగాణ- కంటోన్మెంట్
హైదరాబాద్‌లోని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 52 బృందాలుగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలతోపాటు బంధువుల ఇండ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. మంత్రి సోదరుడు గోపాల్ రెడ్డి, కుమారులు డాక్టర్ భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి ఇండ్లతో పాటు పలువురు సమీప బంధువుల ఇండ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మంత్రి సమీప బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లను సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి మంత్రి కాలేజీల బాధ్యతల్లో ఉన్నారు. ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడికి సన్నిహితుడైన రఘునాథ్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ఎవరినీ రానీయకుండా సెంట్రల్ పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు.
మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం..
ఉదయమే మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలకు బృందాలుగా చేరుకున్న ఐటీ అధికారులు మంత్రి సెల్‌ఫోన్‌తోపాటు ఆయన బంధువులు, కుటుంబీకుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి ..
తీగ లాగితే డొంక కదిలినట్టు సోదాల్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాగస్వాములు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇండ్లల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. అయితే, మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన బ్యాంకు వ్యవహారాలన్నీ క్రాంతి బ్యాంక్ ద్వారానే నిర్వహించడం జరుగుతున్నట్టు గుర్తించారు. బాలనగర్ రాజు కాలనీలో నివాసముంటున్న ఆ బ్యాంకు చైర్మెన్ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. అలాగే, కన్వీనర్ కోటా సీట్లను ప్రయివేటు వ్యక్తులకు భారీ మొత్తానికి అమ్మినట్టు తెలిసింది. నాలుగు మెడికల్ కాలేజీల లావాదేవీలను అధికారులు పరిశీలించారు. మల్లారెడ్డికి సన్నిహితంగా ఉంటున్న సంతోశ్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న విషయం తాజా సోదాల సందర్భంగా వెలుగులోకి వచ్చింది.
మంత్రి అల్లుడి ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్
మంత్రి మల్లారెడ్డి నివాసంతోపాటు అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ బృందాలు ఉదయం నుంచీ సోదాలు నిర్వహించాయి. అయితే, రాజశేఖర్‌రెడ్డి భార్యతో కలిసి ఆయన టర్కీ పర్యటనలో ఉన్నారు. ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్ ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీన్ని తెరవడానికి ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది.