Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నిక అయిపాయే..వీఆర్ఏల సమస్యలు తీరకపాయే
- కేసులెత్తేయలే...సమ్మెకాలం జీతం ఇప్పించలే
- అక్టోబర్ ఏడో తేదీ పోయి రెండువారాలాయే
- అంతా సీఎం చేతుల్లోనే అంటూ చేతులెత్తేసిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏల విషయంలో సానుకూలంగా ఉన్నామంటూనే రాష్ట్ర సర్కారు సాగదీస్తూ పోతున్నది. ఓ సారి మంత్రి కేటీఆర్...మరోమారు సీఎస్ సోమేశ్‌కుమార్...ఇంకోమారు మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు ఇచ్చిన హామీలతో వీఆర్ఏలు సమ్మె విషయంలో వెనక్కి తగ్గి విరమించినా వారిపై దయతల్చట్లేదు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితమొచ్చి 15 రోజులు దాటినా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏ జేఏసీ నేతలు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సంప్రదిస్తే 'నేనేం చేయలేను. అంతా సీఎం చేతుల్లోనే ఉంది' అంటూ దాటవేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మిన వీఆర్ఏల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది.
వీఆర్ఏల విషయంలో మొదటి నుంచీ రాష్ట్ర సర్కారు 'అయ్యో! వారి బతుకులు అంతంతే..వారిపట్ల సానుకూలంగా ఉన్నాం' అంటూ సానుభూతి చూపుతూనే సమస్యల పరిష్కారాన్ని రాష్ట్ర సర్కారు తొక్కి పెడుతున్నది. పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు, సొంతూర్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టియడంతో పాటు సమస్యలన్నీ పరిష్కారిస్తామని అసెంబ్లీ సాక్షిగానూ, పలు మీటింగ్లలోనూ సీఎం కేసీఆర్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో అని వీఆర్ఏలు కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. అయినా వారికి అడుగడుగునా నిరాశే మిగులుతున్నది. వేడుకున్నా.. వినతులిచ్చినా..అర్జీలు పెట్టుకున్నా...ఆందోళనలు చేసినా రాష్ట్ర సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలోని 24 వేలకుపైగా ఉన్న వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్లారు. తమ పోరాటాన్ని చర్చనీయాంశంగా మారారు. సెప్టెంబర్ 13న వీఆర్ఏలు చేపట్టిన చలో అసెంబ్లీ పిలుపునకు ఇంటిలిజెన్స్ కండ్లుగప్పి రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికివారు సద్దులు కట్టుకుని హైదరాబాదుకొచ్చి తమ పోరాట ఆవశ్యకతను సమాజానికి ఎత్తిచూపారు. పోలీసులు నిశ్చేష్టులై 144 సెక్షన్ విధించినా, షాపులన్నీ మూసేయించినా ఎక్కడ అడ్డుకున్నారో అక్కడే కదిలేది లేదంటూ బైటాయించారు. పరిస్థితి చేయి దాటడంతో జేఏసీ బృందాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి పిలుపించుకున్నారు. 'వీఆర్ఏల డిమాండ్లు న్యాయమైనవి. సానుకూలంగా ఉన్నాం. చనిపోతున్న వీఆర్ఏందరూ తెలంగాణ బిడ్డలే. బాధగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్స వాలు, జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు కార్యక్రమాలు ముగియగానే సెప్టెంబర్ 20న చర్చలకు పిలుస్తాం' అని జేఏసీ నేతలకు మంత్రి కేటీఆర్ హామీ నిచ్చారు. అప్పుడు సమ్మె విరమించ కున్నా పోరాట రూపం విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత మెట్రో రైల్వే భవన్లో వీఆర్ఏ జేఏసీ నేతలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపి మరోమారు నచ్చజెప్పారు. ఆ తర్వాత వీఆర్ఏ జేఏసీ నేతలు, సీఐటీయూ రాష్ట్ర నాయకత్వంతో కలిసి బీఆర్కే భవన్లో సీఎస్ సమావేశ మయ్యారు. 'నవంబర్ ఏడో తేదీ వరకు ఆగండి.
మునుగోడు ఉప ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యను పరిష్కరిస్తాం. సీఎం మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. దయచేసి సమ్మె విరమించండి' అంటూ ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. దీంతో 23 వేల మంది వీఆర్ఏలు సమ్మెను విరమించి 80 రోజుల తర్వాత విధుల్లో చేరారు. ఆరోజు చర్చల సందర్భం గా సమ్మెకాలానికి సంబంధిం చిన వేతనాన్ని ఇప్పించేందుకు ప్రయత్నిస్తా మనీ, చలో అసెంబ్లీ, ఆర్టీసీక్రాస్రోడ్డులో జరిగిన మెరుపు ధర్నాల సమయంలో వీఆర్ఏలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తా మని సీఎస్ హామీ నిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక అయి పోయింది గానీ రాష్ట్ర సర్కారు నుంచి వీఆర్ఏలకు ఇంకా పిలు పురాలేదు. జీవితకాలం వేధిస్తున్న సమస్య లు పరిష్కారం కాలేదు. 'సానుకూలం అంటూనే సాగదీయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం ఉంచి వెనక్కి తగ్గితే ఇలాగేనా చేసేది. అయినా, ఇంకా కొద్దిరోజులు వేసి చూస్తాం. అప్పటికీ స్పందించకపోతే మళ్లీ భవిష్యత్ కార్యా చరణ ప్రకటిస్తాం. విజయం సాధించే దాకా వెనకడుగు వేయం' అంటూ వీఆర్ఏ జేఏసీ నేతలు నొక్కి చెబుతున్నారు.