Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలున్నా పొజీషన్ చూపని వైనం
- ఇండ్ల పథకంలో రిజర్వేషన్లపై అస్పష్టత
- నాలుగు దశల్లో డబ్బుల చెల్లింపు
- ఇతర పథకాల్లో లబ్దిపొందితే నో ఛాన్స్
- స్థలాల్లేని పేదలకు స్థలాల్వివ్వాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ-మెదక ప్రాంతీయ ప్రతినిధి
స్థలముండీ ఆర్థిక స్థోమత లేనివారికి సొంతింటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఈ పథకం గురించి ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశారు. పథకం ఉద్దేశం బాగానే ఉంది. కానీ..! ఇండ్లు లేని, ఇంటి స్థలంలేని పేదల సంగతేంటనే ప్రశ్న ఎదురవుతోంది. స్థలాల్లేని వాళ్లకు ప్రభుత్వమే స్థలాలివ్వాలనే డిమాండ్ వస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 90 శాతం మంది పేద, నిరుపేదలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. ఇండ్ల నిర్మాణ పథకంలో వారికి రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు చేస్తామనడంలో ఆంతర్య మేంటనే చర్చ వినిపిస్తోంది. రేషన్‌కార్డు, ఇండ్ల స్థలాల్లేని పేదల గురించి ఈ పథకంలో ఏమైనా పేర్కొంటారా.. లేదా.. చూడాలి.
గ్రామీణ ప్రాంతంలో కనీసం 75 గజాలు, పట్టణాల్లో 50 గజాల స్థలమున్న లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఈ పథకం గురించి ఎప్పటి నుంచో చర్చ ఉన్నప్పటికీ తాజాగా సీఎం కేసీఆర్ ఈ పథకం అమలు గురించి ప్రకటించారు. లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలను పురమాయించడంతో పథకం గురించి ఇండ్లు ్లలేని పేదల్లో ఆసక్తి కనిపిస్తోంది. పథకం అమలు గురించి లబ్దిదారుల ఎంపిక, డబ్బుల చెల్లింపు వంటి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇంటి స్థలముండి ఇండ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వం రూ.3 లక్షలు అందించనుంది. తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సంస్థ సహకారంతో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు దశల్లో పేమెంట్ చేసే అవకాశముంది. బేస్మెంట్, గోడల నిర్మాణం, స్లాబ్, పినిషింగ్ ఇలా నాలుగు దశల్లో పనులు జరిగాక రూ.75 వేల చొప్పున లబ్దిదారులకు అందజేస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకంలో లబ్ది చేకూర్చాలని ప్రభుత్వం బావిస్తోంది. నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున నిర్మాణం చేయనున్నారు. ఇప్పటికే రూ.12 వేల కోట్ల నిధుల్ని ప్రకటించారు. దాంతో పథకం అమలుకు నిధుల ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
స్థలాల్లేని పేదల సంగతేంటీ..?
రాష్ట్రంలో ఇండ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని అనేక మండల, పట్టణ కేంద్రాల్లో ఇండ్ల స్థలాల్లేని పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకొని పట్టాల కోసం కొట్లాడారు. ఆ పోరాటాల ఫలితంగా చాలా చోట్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. కానీ..! వాళ్లకు పొజీషన్ చూపలేదు. పొజీషన్ చూపిన చోట కంపెనీలు, రోడ్లు, డబుల్ ఇండ్ల పేరిట తిరిగి గుంజుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి ఇప్పటి వరకు పొజీషన్ చూపలేదు. సదాశివపేట మండల కేంద్రంలో 5300 మంది పేదలు పోరాడిన ఫలితంగా 2012లో ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చి.. ఆ తర్వాత పొజీషన్ చూపలేదు. ఆ భూములు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆ భూములను పట్టాలున్న తమకు పొజీషన్ చూపాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రామయణంపేట, మెదక్ పట్టణంలో ఇండ్ల స్థలాల కోసం పోరాడారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పేదలకు పట్టా లిచ్చిన భూముల్ని స్వాధీనం చేసుకొని డబుల్ ఇండ్లను కట్టింది. అందులో పట్టాలున్న పేదలెవ్వరికీ ఇండ్లు కేటాయించలేదు. వాళ్లందరూ ఇప్పుడు రూ.3 లక్షల పథకా నికి అర్హులు కాకుండా పోతున్నారు. పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యంలో నిరుపేదలుంటున్న కాలనీలో పూరి గుడెసెల్లోనే మగ్గుతున్నారు. వాళ్లకు డబుల్ స్కీంలో ఇండ్లు కట్టివ్వలేదు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు, ఆందోళ్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని స్వంత ఇంటి స్థలాల్లేని పేదలు పెద్ద ఎత్తున ఉన్నారు. పారిశ్రామికవాడ ల్లో దశాబ్దాలుగా స్థిరపడి జీవిస్తున్న వలస కార్మికులకూ ఇండ్లు, ఇండ్ల స్థలాలూ లేవు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో లాటరీ ద్వారా కొద్దిమందికే ఇండ్లు ఇచ్చింది. 80 శాతం మంది పేదలకు ఆ పథకంలో ఇండ్లు రాలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న రూ.3 లక్షల పథకంలోనూ స్థలాల్లేవనే నెపంతో ఇండ్లు దక్కే అవకాశమూ లేకపోలేదు.
రిజర్వేషన్ల వల్ల లాభమేంటీ..?
ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసే పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం చొప్పున కేటాయిస్తారంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు లేని పేదల్లో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. వీరికి చట్ట ప్రకారం ఉన్న రిజర్వేషన్ల మేరకే లబ్దిదారుల్ని ఎంపిక చేస్తే మిగతా వారికి సొంతింటి కల ఎలా నెరవేరుతుందనే చర్చ గ్రామాల్లో జరుగుతోంది. నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయిస్తారంటున్న ప్రభుత్వం.. అందులో ఎస్సీ, ఎస్టీలకు కలిపి 25 శాతం మాత్రమే కేటాయిస్తే మొత్తం ఇండ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు సొంతిల్లు దక్కుతుందా అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 90 శాతంగా ఉన్న పేదలకు మొదటి ప్రాధాన్యతగా లబ్దిదారుల ఎంపిక జరగాలని కోరుతున్నారు. అదే విధంగా గతంలో లబ్దిపొందిన వాళ్లకు ఈ పథకంలో అర్హతలేదనే చర్చ వినిపిస్తుంది. పదేండ్ల కిందట ఉమ్మడి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అప్పులు చేసి రెండు గదులు వేసుకున్నారు. ఇద్దరు, ముగ్గురు కొడుకులున్న ఆ ఇంట్లో వాళ్లకు పెళ్లిండ్లు అయ్యి పిల్లలతో వేరుపడి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్లకు ఈ పథకంలో వర్తింప చేస్తరా లేదా అనేది స్పష్టతలేదు. రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వాళ్లను కూడా పరిశీలించాలంటున్నారు.
ఆర్థిక సాయమే కాదు ఇండ్ల స్థలాలూ ఇవ్వాలి
పట్టణ, మండల కేంద్రాల్లో ఇండ్ల స్థలాల్లేని నిరుపేదలున్నారు. వారంద రూ గతంలో పోరాడారు. ఫలితంగా చాలా చోట్ల పేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా ఇండ్ల స్థలాలివ్వ లేదు. పైగా గత ప్రభు త్వం ఇచ్చిన పట్టాల్ని రద్దు చేయడం, లేదంటే పేదలకి చ్చిన స్థలాల్ని లాక్కోవడం చేసింది. పోరాడి సాధించుకు న్న పట్టాదారులకు పొజీషన్ చూపి కొత్తగా ఇంటి నిర్మాణా నికి ఆర్థిక సాయం చేయాలి. ఇండ్ల స్థలాల్లేని పేదలకు ప్రభుత్వమే స్థలాల్ని కేటాయించి వారికి ఇంటి నిర్మాణం కోసం సాయం చేయాలి. సంగారెడ్డి,మెదక్, సిద్దిపేట జిల్లా ల్లో పారిశ్రామిక కేంద్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో నూ స్ధలాల్లేని పేదలకు ఇండ్ల్ల స్థలాలు కేటాయించి పట్టాలి వ్వాలి. పట్టాలిచ్చిన చోట వెంటనే పొజీషన్ చూపాలి.
- మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మెదక్
5300 మందికి ఈ పథకం వర్తింపజేయాలి
పోరాడిన ఫలితంగా 2012లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలం చూపించి పట్టాలిచ్చింది. ఇండ్ల నిర్మాణం చేస్తామని చెప్పి చేయకుండా వదిలేసింది. అట్టి భూమిని పట్టాలున్న పేదలకు పొజీషన్ చూపాలి. వాళ్లందరూ నిరుపేదలైనందున ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పథకం వర్తింప చేసి ఇండ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలి. పొజీషన్ కోసం పేదలు నెలల తరబడి పోరాడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదు. పొజీషన్ చూపే వరకు పోరాడుతాం.
- ప్రవీణ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, సదాశివపేట