Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తరోడ్లు, సిబ్బంది నియామకాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ రోడ్లను అందంగా, అద్దంలా ఉంచాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ పునర్వవస్థీకరణ వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించాలనీ, అవసరమైన పోస్టులు భర్తీ చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇంజినీర్ ఇన్ ఛీఫ్ సంజీవరావు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ..రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణపై డిసెంబర్ 10లోపు టెండర్ల ప్రతిపాదనలు పూర్తి చేయాలనీ, డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వరదనీటితో దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలనీ, అటవీ భూముల సమస్యపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలు, గ్రామ పంచాయతీలలో కొత్త సర్కిళ్లు, డివిజన్ల వారీగా వేయాల్సిన కొత్త రోడ్లను, అవసరమైన సిబ్బంది కోసం కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 19న జరిగిన పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ వర్క్ షాప్‌లో చర్చించిన రోడ్ల తక్షణ మరమ్మత్తులు, నిర్వహణ ప్రతిపాదనలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలు, నియోజక వర్గాలవారీగా అత్యవసరమైన పనుల జాబితా రూపొందించాల న్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 67 వేల కిలోమీటర్ల రోడ్లను అద్దంలా తీర్చిదిద్దాలని సూచించారు. శాఖ పునర్వవస్థీకరణ కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ మరో వంద కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
అంబేద్కర్ వర్సిటీ వీసీని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ కె సీతారామారావు సతీమణి కుసుంబ రేవతి ఇటీవల మరణించడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక్‌రావు బుధవారం హైదరాబాద్‌లో ఆయనను పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ద సుదర్శన్‌రెడ్డి, వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.