Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
మున్సిపల్ కమిషనర్, మేనేజర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బుధవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం... జహీరాబాద్ పట్టణంలోని ముసానగర్ కాలనీలో మహ్మద్ నిసార్ ఇల్లు కొనుగోలు చేశారు. ఈ ఇంటిని ముటేషన్ చేయించడానికి మున్సిపల్ అధికారులను కలిశారు. ఇంటికి సంబంధించిన కాగితాలు సక్రమంగా లేవని, లిటిగేషన్లో ఉన్నందున ముటేషన్ చేసేందుకు మున్సిపల్ మేనేజర్ మనోహర్ రూ.3 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. అన్ని డబ్బులు తన వద్ద లేవని, తగ్గించాలని నిసార్ విజ్ఞప్తి చేశారు. కమిషనర్ సుభాష్‌రావు వద్దకు తీసుకెళ్లి ఆయన సమక్షంలో చర్చలు జరిపారు. రూ.రెండున్నర లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అంత డబ్బు ఇచ్చుకోలేని నిసార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ మనోహర్ వద్దకు రూ.2.50 లక్షలు డబ్బులు ఇచ్చేందుకు నిస్సార్ వెళ్లారు. రూ.రెండున్నర లక్షలు కాదు రెండు లక్షలు మాత్రమే ఇవ్వండి.. చాలు అని మనోహర్ చెప్పి.. వాటిని అటెండర్ రాకేష్‌కు ఇవ్వాలని సూచించారు. ఆ డబ్బును అటెండర్ రాకేష్ తీసుకొని కమిషనర్ సుభాష్‌రావు, మేనేజర్ మనోహర్‌కు అందజేశారు. వెంటనే ఏసీబీ అధికారులు వలపన్ని కమిషనర్, మేనేజర్‌ను పట్టుకున్నారు. జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుభాష్రావును ఏ 1గా, మేనేజర్ మనోహర్‌ను ఏ 2గా, అటెండర్ రాకేష్‌ను ఏ 3గా కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వెంకట్ రాజాగౌడ్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతిని భరించలేకనే ఏసీబీని సంప్రదించాను : మహమ్మద్ నిసార్, బాధితుడు
ఇంటి ముటేషన్‌కు రూ.మూడు లక్షల లంచం అడుగుతున్నారంటే నిరుపేదలను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో భయమేస్తోంది. ఈ దోపిడీని అరికట్టేందుకే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఆరు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగితే అధికారులు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. రూ.లక్షలు లంచం డిమాండ్ చేయడం భరించలేకపోయాను. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలని, ప్రజలకు సేవ చేయాలని మనవి.