Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ప్రాథమిక అభ్యసనా సామర్థ్యాల సాధన (ఎఫ్ఎల్ఎన్)ను అమలు చేయడం అసాధ్యమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా, వారిపై రాతపని భారాన్ని తగ్గించకుండా, శాశ్వత పర్యవేక్షణ అధికారులను నియమించకుండా ఎఫ్ఎల్ఎన్ అమలు కోసం పై స్థాయిలో అధికార యంత్రాంగంతో ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండబోదని పేర్కొన్నారు. ఎఫ్ఎల్ఎన్ అమలును పర్యవేక్షించటానికి నోడల్ అధికారులను నియమించారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు తదితర యంత్రాంగమంతా ప్రాథమిక పాఠశాలలపై మూకుమ్మడిగా దాడి చేసినట్టు పర్యటించి ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు అయోమయానికి గురౌతున్నారని తెలిపారు. ఇది చాలదన్నట్టు జిల్లా అకడమిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయటం వల్ల అదనంగా ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయని వివరించారు. ఏడు వేల మందిని సర్దుబాటు పేరుతో ఉన్నత పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించారని గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే సమాంతరంగా ఇంగ్లీషు మీడియం కూడా ప్రారంభించారని తెలిపారు. ఉపాధ్యాయుల్లేకుండా ఎఫ్ఎల్ఎన్ అమలు ఎలా సాధ్యమౌతుందని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. పాఠశాలల్లో సరిపడినంతమంది ఉపాధ్యాయులను నియమించి, శాశ్వత పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి బోధనాభ్యసన ప్రక్రియ స్వేచ్ఛగా సాగేలా వాతావరణం కల్పించాలని కోరారు. తద్వారా మాత్రమే ఎఫ్ఎల్ఎన్ విజయవంతమయ్యే అవకాశముందని సూచించారు.