Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనిషిని మనిషిగా గుర్తించాలి : ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ- ముషీరాబాద్
సమాజంలోని అసమానతలు తొలగిపోయి మనిషిని మనిషిగా గుర్తించే రోజులు రావాలని, ప్రస్తుతం దేశంలో నిజాలు మాట్లాడటమే నేరమైందని, ఇది ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదం అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. భారత విప్లవోద్యమ నేత చంద్ర పుల్లారెడ్డి 38వ వర్ధంతి సందర్భంగా అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డేగల రమ అధ్యక్షతన అమరుల సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరులను స్మరించుకోవడం అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆహ్వానించడమేనని చెప్పారు. సమాజంలోని అసమానతలు తొలగిపోయి మనిషిని మనిషిగా గుర్తించే రోజులు రావాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతం పేరుతో జరుగుతున్న విద్వేషాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో ఒకరోజు ప్రజలు తప్పకుండా మార్పును కోరుకుంటారని, ఆ మార్పే ప్రత్యామ్నాయ వ్యవస్థ అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ మాట్లాడుతూ.. అమరుల ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన నిర్బంధం కొనసాగుతున్నదని, దీనిపై ప్రజలు నిరసన తెలుపుతున్నారని చెప్పారు. దేశంలో అంబానీ ఆదాయం పెరుగుతుంది కానీ ప్రజల బతుకుల్లో మార్పు రావడం లేదన్నారు. ప్రజా గాయకులు విమలక్క మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను ఎత్తిపడుతూ వారు చూపిన బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మోహన్ బైరాగి, మన్సూర్, రైతు కూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నాగిరెడ్డి, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అల్లూరి విజరు, ఏఐఎఫ్టీయూ నాయకులు అనసూయ, మల్లేష్, రాములు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.