Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అస్వస్థత
- సూరారంలోని ఆస్పత్రికి తరలింపు
- ఆస్పత్రికి వచ్చిన మంత్రికి అనుమతి నిరాకరణ
- రాత్రంతా తన కొడుకును సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారు: మంత్రి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు బుధవారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారులు కేంద్ర బలగాల సహాయంతో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మంత్రి ఇంటి వద్ద భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడులు జరుగు తున్న సమయంలో మంత్రి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి చాతిలో నొప్పితో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో అతన్ని సూరారంలోని మల్లారెడ్డి నారాయణ హృదయాలయం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, మంత్రి ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వద్ద ఐటీ అధికారులు అడ్డుకున్నట్టు తెలిసింది. తనిఖీల నేపథ్యంలో ఆయనను అనుమతించనట్టు సమాచారం. దాంతో వారితో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. అనంతరం మంత్రి సురారంలోని ఆస్పత్రి వద్దకు చేరుకోగా అక్కడ భారీగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. మంత్రిని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన ఆస్పత్రి ముందు కొద్దిసేపు బైటాయించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో ఐటీ దాడులు చేపడు తున్నారని, తామేమైనా దొంగ వ్యాపారం చేస్తున్నామా? అని ప్రశ్నించారు. ఐటీ అధికారులు తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆరో పించారు. తన కొడుకుని సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని, రాత్రంతా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇప్పుడు చూడటానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని చెప్పారు. అవసరమైతే విచారణ చేపట్టాలిగానీ ఈ దారుణ మేంటని ప్రశ్నించారు. కక్షపూరితంగానే తమ కుటుంబంపై ఐటీ దాడులకు దిగారని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ సోదాల్లో ఎలాంటి డబ్బులు పట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇక మహేందర్ రెడ్డి హైపర్ టెన్షన్ వల్లే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
మంత్రి కుటుంబ సభ్యుల ఇండ్లలో సోదాలు
మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలోనూ రెండో రోజూ ఐటీ సోదాలు జరిగాయి. మల్లారెడ్డి ఇద్దరు కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బంధువుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. మహేందర్రెడ్డి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో డైరెక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు.
ఎలక్ట్రానిక్ లాకర్లలో భారీగా నగదు..?
మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లోని ఎలక్ట్రానిక్ లాకర్లను ఐటీ అధికారులు తెరిచారు. అందులో లభించిన నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మంత్రి నివాసంలో ఉన్న రెండు లాకర్లు తెరవాల్సి ఉందని, ఆ లాకర్లు తెరిచేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం బయలుదేరిందని సమాచారం. మంత్రి నివాసం చుట్టూ భారీగా రాపిడ్ యాక్షన్ పోలీస్ బలగాలను మోహరించారు. ఈ రాత్రి కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మంత్రి, రాజశేఖర్ రెడ్డి నివాసాల్లో స్వాధీనం చేసుకున్న నగదు వివరాలను ఐటీ అధికారులు గోప్యంగా ఉంచారు. సోదాలు పూర్తయిన తర్వాత విషయాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.
మంత్రికి పరామర్శ
మంత్రిని పరామర్శించడానికి ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు నాయకులు ఆయన ఇంటి గేటు ముందు పడిగాపులు కాసినా అధికారులు వారికి అనుమతివ్వలేదు.