Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్‌ను ఆదేశించిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ఈమెయిల్ ద్వారా మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణకు హాజరయ్యేలా సంతోష్‌ను ఆదేశించాలని కోరుతూ సిట్ వేసిన పిటీషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సంతోష్ లేఖ రాశారనీ, సిట్ ఎదుటకు ఎప్పుడు వస్తారో? అందులో చెప్పలేదని అడ్వకేట్ జనరల్ బీ.ఎస్.ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సంతోష్‌ను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎలా కోరుతున్నారని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణనను ఈ నెల 30కి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున ఏజీ బీ.ఎస్.ప్రసాద్, సిట్ తరపున అదనపు ఏజీ రాంచందర్ రావు వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేల ఎర కేసులపై దాఖలైన పలు పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సమయంలో లాయర్లు బిగ్గరగా వాదనలు చెప్పడంతో హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా వాదనలు సరికాదనీ, విషయాన్ని వాదించి జూనియర్లకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికింది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి తరపున సీనియర్ లాయర్ ఎస్.రాంచందర్ రావు వాదనలు వినిపించారు. బీఎల్ సంతోష్‌పై సిట్ వాదనలను వ్యతిరేకించారు. సంతోష్ ఆధారాలను ధ్వంసం చేస్తారనే వాదనల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వమే అన్ని ఆధారాలను బట్టబయలు చేసిందని చెప్పారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల మేరకు వేరే చోట సంతోష్ ఉన్నారని, సిట్‌కు గడువు కావాలని కోరుతూ లేఖ రాశారని చెప్పారు. బీజేపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ వైద్యనాథన్ వాదిస్తూ, బీఎల్ సంతోష్ బిజీగా ఉన్నారనీ, సిట్ దర్యాప్తునకు గడువు కావాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, మీరు సంతోష్ తరఫున వాదిస్తున్నారా, 41ఎ సీఆర్ పీసీను సవాల్ చేశారా అని ప్రశ్నించింది. సంతోష్ నుంచి ఏ విధమైన సమాచారం లేదని ఆయన జవాబు చెప్పారు. నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మహేష్ జఠ్మలానీ వాదిస్తూ, సిట్ దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సిట్ ఉండాలో లేదో తేల్చాలనీ, ఇదే విషయం సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ గురువారం రిట్ వేస్తామన్నారు. వాదనలు తర్వాత హైకోర్టు, సిట్ మరోసారి సంతోష్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు 41ఎ సీఆర్ పీసీ నోటీసును కొట్టేయాలని న్యాయవాది ప్రతాప్ గౌడ్, సిట్ విచారణ పేరుతో వేధిస్తోందంటూ కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌లు విడివిడిగా రిట్లు వేశారు..