Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ - ఓయూ
ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగితే అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఓయూలోని అంబేద్కర్ లైబ్రరీ ఐఎస్ఎస్ఆర్ హాల్లో 'భారత ఆర్థిక పయనం ఎటు' అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పెట్టుబడిదారులకు లబ్ది జరిగింది కానీ సాధారణ ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ కలగలేదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉందని, 2030లో జపాన్, జర్మనీ దేశాలను దాటవేసి మూడో స్థానంలో ఉంటుందన్నారు. అయితే, బ్రిటన్ కంటే భారత్ ముందు స్థాయిలో ఉందనుకోవడం మన పొరపాటన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కార్ల ఉత్పత్తి వేగంగా పెరిగిందని, వీటి కోసం ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇచ్చాయని చెప్పారు. ఉత్పత్తిదారుల మూలంగానే ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే, పెట్టుబడిదారులకు కల్పించే రాయితీల కంటే పేదలకు కూడా ఉత్పత్తిలో రాయితీలు అందిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో లబ్ది పొందుతారన్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. చింత గణేష్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఎల్పీజీ నమూనాలో ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయొద్దని కోరారు. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొ.చంద్రు నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా క్షీణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులన్నీ సమాన ఉద్దేశంతో అందరికీ సమపాలుగా పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, రవి నాయక్, ఉపాధ్యక్షులు రామాటేంకి శ్రీను, శర్మ, మమత, సాయి కిరణ్, సహాయ కార్యదర్శి రాజు, పవన్ కళ్యాణ్, నాయకులు సాయి ధనుష్, అజయ్ కళ్యాణ్, అనుష, స్వాతి తదితరులు పాల్గొన్నారు.