Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- పాడె మోసిన మంత్రులు అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి
- 'వీ వాంట్ జస్టిస్' అంటూ ఫారెస్ట్ సిబ్బంది నినాదాలు
- ఆయుధాలివ్వకపోతే విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం
- 'పోడు' సర్వే నిలిపివేస్తామని హెచ్చరిక.. సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న మంత్రులు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ రఘునాథపాలెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబోడు ప్రాంతంలోని వలస ఆదివాసీల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావుకు బుధవారం కడసారి వీడ్కోలు పలికారు. తన స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలోని శ్రీనివాసరావు వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాల నడుమ కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అంత్యక్రియలకు హాజరై పాడె మోశారు. అధికార లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్ దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం ఎస్పీ వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఎఫ్ఆర్వో కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రులు
అంతకుముందు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు పరిహారం, శ్రీనివాసరావు రిటైర్మెంట్ వయస్సు వచ్చేంతవరకు యథాతథంగా నెలవారీ వేతనం. బీఎస్సీ, బీఎడ్ చేసిన శ్రీనివాసరావు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలం ప్రకటించిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.2 లక్షల నగదును మంత్రుల చేతుల మీదుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అందించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడులను సహించేది లేదన్నారు. హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని చెప్పారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుందన్నారు. పోడు నరికినట్టు అటవీ అధికారులను కూడా నరుకుతాం... దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అటవీశాఖ సిబ్బంది నినాదాలు... ఉద్రిక్తత..
శ్రీనివాసరావు అంత్యక్రియల సందర్భంగా తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ అటవీశాఖ సిబ్బంది నినాదాలు చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి కూడా పలువురు అటవీశాఖ అధికారులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రులకు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆయుధాలు లేకుండా అడవుల్లో తిరగడం వల్ల తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు వెంటనే ఆయుధాలివ్వాలని, శ్రీనివాసరావును దారుణంగా చంపిన వారిని ఎన్కౌంటర్ చేయాలని, చత్తీస్గఢ్ నుంచి వచ్చి మన రాష్ట్రంలో అస్థిరతను సృష్టిస్తున్న వలస ఆదివాసీలను తరిమేయాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు లేకుండా పోడు పట్టాల ఫీల్డ్ సర్వేలో పాల్గొనాల్సి రావడం వల్లే శ్రీనివాసరావు హత్య జరిగిందని ఆరోపించారు. వెంటనే ఆయుధాలు ఇవ్వకపోతే విధులను బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు. వీటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రులు హామీనిచ్చారు. ఈ సమయంలోనే ఫారెస్ట్ సిబ్బంది 'వీ వాంట్ జస్టిస్..' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందని భావించిన పోలీసులు, అప్పటికే అంత్యక్రియలు పూర్తి కావడంతో మంత్రులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సమయంలో ఒకరిద్దరు ఫారెస్ట్ సిబ్బంది కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియలు జరిగే సమయంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
హత్యకు సీపీఐ (ఎం) ఖండన
రేంజర్ శ్రీనివాసరావు హత్యను సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఖండించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, రఘునాథపాలెం మండల కార్యదర్శి ఎస్. నవీన్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు యసా నరేష్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్రీనివాసరావుకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఓ ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. శ్రీనివాసరావు హత్యను ఖండించారు.